● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ శాఖల్లో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం పనికిరాదని సూచించిన గడువుకు ముందే ప్రగతిని సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆర్‌అండ్‌బీ, ఐసీడీఎస్, విద్య, విద్యుత్, మున్సిపాల్టీ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యానవన రంగాల్లో బహుళ పంటల దిశగా ఆలోచన చేయాలని తద్వారా రైతులు అధిక ఆదాయం పొందుతారన్నారు. అలాగే జిల్లాలో ఈ–పంట నమోదు శతశాతం జరగాలని చెప్పారు.
రైతు సేవా కేంద్రాల వారీగా వర్క్‌షాపులు
రైతు సేవా కేంద్రాల వారీగా వర్క్‌షాపులు ఏర్పాటు చేసి ప్రతి రైతుకు డ్రోన్స్ వాడకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అలాగే అటవీ సంపద పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పశుసంపద మరింత వృద్ధి ఉండాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు, పశుసంవర్థకశాఖల అధికారులు కె.రాబర్ట్‌పాల్, టి.సంతోష్‌కుమార్, ఏవీ సాల్మన్‌రాజు, డా.ఎస్. మన్మథరావు, డీఆర్‌డీఏ, ఐసీడీఏఎస్ పీడీలు సుధారాణి, కనకదుర్గ, మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు.