
264 గ్రామాలకు త్వరగా ‘దారి’ చూపాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో డోలీ మోతలు నివారించేందుకు రహదారి సౌకర్యం లేని గిరిజన ప్రాంతాల్లో గల ఏడు మండలాలైన కొమరాడ, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని, సీతంపేట, జియ్యమ్మవలసలలో గల 264 గ్రామాలను గుర్తించామని, వాటికి ప్రాధాన్యం ఇస్తూ ఇంజినీరింగ్ అధికారులు వీలైనంత వేగంగా రహదారి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో గల సమావేశ మందిరంలో గిరిజన ప్రాంతాల్లో రహదారుల సౌకర్యంపై జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారి సౌకర్యాలు లేని గ్రామాలకు రహదారులు కల్పించే వెసులుబా టు ఉందన్నారు. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో కనీస రహదారి సౌకర్యానికి నోచుకోని గ్రామాలను గుర్తించి సంబంధిత అధికారులను, బృందాలుగా ఏర్పాటు చేశామని చెప్పారు. అందులో భాగంగా డోలీమోతలకు తావులేకుండా ఆయా గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తూ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.