
ప్రభుత్వ వైద్య విద్య పరిరక్షణే ధ్యేయంగా..
నేడు చలో వైద్య కళాశాల వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహణ ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పనున్న పార్టీ నాయకులు
సాక్షి, పార్వతీపురం మన్యం: పేదవాడికి నాణ్యమైన ఉచిత వైద్యం, మెడికల్ విద్య చేరువ చేయాలన్న గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ లక్ష్యానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాలో ప్రారంభం కావలసిన వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు వైద్య కళాశాలలను కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..పేద ప్రజలకు అండగా నిలిచేందుకు.. జిల్లా వాసులకు వాస్తవాన్ని తెలియజేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ప్రభుత్వ వైద్యవిద్య పరిరక్షణే ధ్యేయంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు..వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టనున్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు తెలిపారు. విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చేరుకుని..ప్రజలు, మీడియాకు వాస్తవాలను తెలియజెప్పనున్నారని పేర్కొన్నారు.
తరలిరానున్న పార్టీ నాయకులు
శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో మెడికల్ కళాశాల కార్యక్రమంలో పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొని మద్దతుగా నిలవనన్నారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గ వర్గాల సమన్వయకర్తలతో పాటు.. పార్వతీపురం జిల్లా నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు పీడిక రాజన్న దొర, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ విక్రాంత్ బాబు తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శత్రుచర్ల పరీక్షిత్ రాజు కోరారు.

ప్రభుత్వ వైద్య విద్య పరిరక్షణే ధ్యేయంగా..