
రాకపోకలు ఆపిన అడారుగెడ్డ
● ఉధృతంగా కాజ్‌వేపై నీటి ప్రవాహం ● బిక్కుబిక్కుమంటూ గిరిజనుల రాకపోకలు ● వారపుసంతకు వచ్చిన వారికి తప్పని కష్టాలు
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే ఏవిధంగా గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గెడ్డను దాటుతున్నారో అర్థమవుతుంది. రెక్కాడితే కానీ, డొక్కాడని బతుకులు వారివి. వాగులు, గెడ్డలు పొంగుతున్న వేళ ఊరుదాటలేక, పస్తులతో గడపలేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీ దుగ్గేరు, మెండంగి గ్రామాల మధ్య అడారుగెడ్డ ఉంది. ఒడిశా రాష్ట్రంలో వర్షంకురిస్తే, చడీచప్పుడు లేకుండా అమాంతంగా అడారుగెడ్డ ప్రవహిస్తుంటుంది. అడారుగెడ్డపై నుంచి మక్కువ, సాలూరు మండలాలకు చెందిన గిరిశిఖర గ్రామాల ప్రజలు, పక్కన ఉన్న ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాకు చెందిన పలు గ్రామాలతో కలిపి మొత్తం 35గ్రామాలకు చెందిన గిరిజనులు రాకపోకలు సాగించాల్సి ఉంది. గురువారం దుగ్గేరు గ్రామంలో వారపుసంత జరిగింది. ఈ సంతకు వచ్చిన గిరిజనులు అడారుగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు సాగించలేక అవస్థలు పడ్డారు. స్థానిక యువత వారపుసంతకు వచ్చిన గిరిజనులను గెడ్డ దాటించగా, వాహనాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో, గెడ్డ ఒడ్డున గంటలకొద్దీ సమయం వేచిచూడసాగారు.
–మక్కువ
వరద ఉధృతి తగ్గుదల కోసం గెడ్డఒడ్డున
వేసిచూస్తున్న గిరిజనులు

రాకపోకలు ఆపిన అడారుగెడ్డ