
ప్రైవేట్ సెంటర్‌లో ఎంఆర్‌ఐ స్కాన్..!
● కమీషన్ల కోసం రిఫర్ చేస్తున్న సర్వజన ఆస్పత్రి వైద్యులు
● రూ.4 వేల నుంచి రూ. 5 వేలు వెచ్చిస్తున్న రోగులు
విజయనగరంఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎంఆర్‌ఐస్కాన్ అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యులు రోగులకు ప్రైవేట్ స్కాన్ రాయడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఇచ్చే కమీషన్ల కోసమే వైద్యులు రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కాన్ ఉచితంగా తీయాలి. అదే ప్రైవేట్ సెంటర్‌లో అయితే వేలల్లో కమీషన్ వస్తుందనే కక్కుర్తితో వైద్యులు రిఫర్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రూ.2వేల నుంచి రూ.2500 వరకు కమీషన్
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల వైద్యులు పెద్ద ఎత్తున కమీషన్లు ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ఎక్కువ స్కాన్‌లు ఆఫర్ చేసే వైద్యులకు 40 శాతం నుంచి 50 శాతం వరకు కమీషన్ ఆఫర్ చేస్తున్నారు. తక్కువ స్కాన్‌లు రిఫర్ చేసే వారికి 30 నుంచి 35 శాతం కమీషన్ ఆఫర్ చేస్తున్నారు. ఎంఆర్‌ఐ స్కాన్ చేసే వైద్యుడికి ఒక్కో స్కాన్‌కు రూ.2 వేల నుంచి రూ.2500 వరకు కమీషన్ రూపంలో అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ప్రైవేట్ స్కాన్‌కు రిఫర్ చేయడానికి వైద్యులు అసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
రూ.4 వేల నుంచి రూ.5 వేలు వెచ్చిస్తున్న రోగులు
ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో రోగులు ఎంఆర్‌ఐ స్కాన్ కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఎంఆర్‌ఐ స్కాన్ కోసం రూ.4 వేల నుంచి రూ. 5 వేల వరకు ప్రైవేట్ సెంటర్లు వసూలు చేస్తున్నాయి. వ్యాధి నిర్ధారణలో ఎంఆర్‌ఐ స్కాన్ అత్యంత కీలకం కావడంతో రోగులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వేలాది రుపాయలు వెచ్చించక తప్పడం లేదు.
ఎంఆర్‌ఐ స్కాన్ కోసం ఓ వైద్యుడి కొర్రీ
ఏదైనా వ్యాధితో వచ్చే వారికి సంబంధిత వైద్యుడు ఎంఆర్‌ఐ స్కాన్ రాస్తే ఆస్పత్రిలోని ఓ వైద్యుడు తన సంతకం లేకుండా స్కాన్ తీయడానికి వీలు లేదని కొర్రీ పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులు రాసిన చాలా వరకు ఎంఆర్‌ఐ స్కాన్‌లను ఆ వైద్యుడు వెనక్కి పంపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటాం
ఎంఆర్‌ఐ స్కాన్ కోసం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వైద్యులు రిఫర్ చేస్తున్న విషయం తెలియదు. విచారణ చేసి ఆ విధంగా రిఫర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కాన్ అందుబాటులో ఉంది. అవసరమైన వారికి తీసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్ అల్లుపద్మజ,
సూపరింటెండెంట్, ప్రభుత్వసర్వజన ఆస్పత్రి

ప్రైవేట్ సెంటర్‌లో ఎంఆర్‌ఐ స్కాన్..!