
ప్రభుత్వ ఆస్తులు అప్పగించడమే సంపద సృష్టా?
నెల్లిమర్ల రూరల్: సంపద సృష్టి అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం కాదని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్ బాబు) పేర్కొన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని మొయిద గ్రామంలో గల తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలల నిర్మాణ విషయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప సంకల్పంతో ముందుకెళ్తే, ప్రస్తుత సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేట్ దళారులకు వాటిని కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం ఉందని, ఏది చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణిని విడనాడాలని హితవు పలికారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అన్ని వర్గాల్లోనూ చర్చ జరగాలని ఆయన అభిలషించారు. 1923లో విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీ మొదలుకుని 2024లో పాడేరులో పూర్తయిన మెడికల్ కాలేజీ నిర్మాణం వరకు ఒక్క కాలేజీని కూడా చంద్రబాబు తీసుకురాలేదని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జిల్లాల సంఖ్యను పెంచి ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కళాశాలలు ప్రారంభమై తరగతులు కూడా మొదలు పెట్టినట్లు గుర్తుచేశారు. ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయన్నారు. ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు అండ్ కో తట్టుకోలేదని, అసలు మెడికల్ కళాశాలల నిర్మాణాలే జరగలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసునని ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మండలిలో సమస్యలు ప్రస్తావిస్తా
గురువారం నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తానని ఎమ్మెల్సీ సురేష్ బాబు పేర్కొన్నారు. తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు మునిగిపోయి, జీవనోపాధి కోల్ఫోయిన సారిపల్లి, కుదిపి, నీలంరాజుపేట గ్రామాల ప్రజలకు పీఏఎఫ్ ప్యాకేజీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తానని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన కోరాడపేట, ఏటీ అగ్రహరం, పడాలపేట గ్రామ ప్రజలకు పునరావాస కల్పనపై ప్రశ్నిస్తానని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను
విరమించుకోవాలి
రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ఏర్పాటు ఘనత వైఎస్ జగన్‌దే
ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు