
ధర్నాకు కదలిరండి
పార్వతీపురం టౌన్: లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రవాణా రంగంలో ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని సీఐటీయూ జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ అన్నారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలతో ఆటో స్టాండ్ల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగ యువకులు ఉన్నత చదువులు చదివి ఆటో డ్రైవర్లుగా మారుతున్నారని, ప్రభుత్వాలు వారికి బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వనందున ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర అధిక వడ్డీకి అప్పులు తీసుకుని ఆటోలను కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచడం, ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు, ఆర్టీఏ చలానాలు, ఈ చలానా ఫైన్లు, మ్యాట్రిక్స్ కెమెరాల సెన్సార్ ఫైన్‌లే కాకుండా ప్రైవేట్ ఫైనాన్సర్ల అధిక వడ్డీల దోపిడీలకు బలైతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రవాణా రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనతో ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీచేసే ఏటీసీలను ఏర్పాటు చేసి రవాణా కార్యాలయాలను నిర్వీర్యం చేసిందని వెహికల్‌కు అన్ని అర్హతలు ఉన్నా సెంటర్ వారు ఉద్దేశపూర్వకంగానే ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆటో, క్యాబ్, టాటా ఏస్ డ్రైవర్ల కుటుంబాలు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న అన్ని ఆటో, ట్రాన్స్‌పోర్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బి.సూరిబాబు, పి.రాజశేఖర్, యూనియన్ నాయకులు ఎన్.రాజు, ఎ.చిరంజీవి, బి.జన, ఎస్.నాగభూషణ, జీవీ శ్రీనివాసరావు, ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో, క్యాబ్, టాటాఏస్ డ్రైవర్‌లకు సీఐటీయూ పిలుపు
పార్వతీపురంలో కరపత్రాలతో ప్రచారం