
11 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
● ఒక్కొక్కరికీ రూ.20 వేలు జరిమానా
● విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వీఆర్వోలకు నోటీసులు
● సాక్షి కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు
బొబ్బిలి: బొబ్బిలి రెవెన్యూ డివిజన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారులు వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న 11 ట్రాక్టర్లను అడ్డుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈనెల 15న సాక్షి దినపత్రికలో ‘ఆగని ఇసుక దందా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు రెండు రోజులుగా అనధికార ఇసుక రేవులపై నిఘా ఉంచారు. మండలంలోని వేగావతి నది పరీవాహక ప్రాంతాలైన పెంట, పారాది, అలజంగి గ్రామాలతో పాటు బాడంగి మండలం పాల్తేరు నుంచి కొన్ని ట్రాక్టర్లు ఆయా అనధికార ఇసుక రేవుల్లో భారీగా ఇసుకను తవ్వి తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన 11 ట్రాక్టర్లను స్వాఽధీనం చేసుకున్నారు. వాస్తవానికి పేరుకు ఉచిత ఇసుక అంటూ వ్యాపారులే అక్రమంగా వాణిజ్య వ్యాపారాలకు ఇసుకను తరలిస్తున్నారు. పారాది వద్ద ఆర్టీఓ రామ్మోహనరావు, అలజంగి వద్ద తహసీల్దార్ శ్రీను, పెంట వద్ద ఆర్‌ఐ రామకుమార్‌లు అక్రమ ఇసుక ట్రాక్టర్లను పలు దఫాలుగా గుర్తించి పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం శ్రీను విలేకరులతో మాట్లాడుతూ మొదటి హెచ్చరికగా ఒక్కో ట్రాక్టర్‌కు రూ.20 వేలు చొప్పున జరిమానా విధించామన్నారు. మరో మారు అక్రమ ఇసుకతో దొరికితే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.
సచివాలయ సిబ్బందికి నోటీసులు:
కాగా గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసురావడంలో అలసత్వం వహించిన అలజంగి, పెంట, పారాది గ్రామ సచివాలయాల వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, మహిళాపోలీస్‌కు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
మైనింగ్‌శాఖ విజిలెన్స్ ఏం చేస్తున్నట్లు?
కాగా ఒక్క పూట రెవెన్యూ అధికారులు దృష్టిసారించి 11 అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటే మైనింగ్ శాఖలోని విజిలెన్స్ విభాగానికి కనీసం చీమకుట్టినట్లయినా లేకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా అక్రమ గ్రావెల్, ఇసుక అక్రమ తవ్వకాలపై రె వెన్యూ శాఖ స్పందించినట్లు మైనింగ్ విజిలె న్స్ విభాగం కనీసం స్పందించలేదు. కూట మి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క అక్రమ మైనింగ్ కేసును కూడా ఈ ప్రాంతంలో నమోదు చేయకపోవడంతో వారి పనితనం తెలుస్తోందన్న విమర్శలు అటు ప్రజల నుంచి ఇటు ఇతర శాఖల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మైనింగ్ విజిలెన్స్ విభాగం దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

11 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత