నిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: మన్యం జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం పార్వతీపురం మండలంలోని చప్పవానివలస గ్రామంలో కలెక్టర్ పర్యటించి వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను ఆయన నేరుగా స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. గృహ నిర్మాణాలు జాప్యానికి గల కారణాలను అధికారులను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన రెండవ విడత బిల్లులు మరి కొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ ఎంతమేరకు అందుబాటులో ఉందో అధికారులను ఆరా తీశారు. గృహ నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా అవసరమైన మెటీరియల్‌ను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి జి.సోమేశ్వరరావు, చిరంజీవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


