సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర
సాక్షి, పార్వతీపురం మన్యం: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సబ్ సెంటర్లలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌వో) చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా.. సమ్మెలో ఉన్న సీహెచ్‌వోలందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. అది కూడా నేరుగా ఇవ్వకుండా.. వారికి సంబంధించిన సీహెచ్‌వో యాప్‌లో నోటీసులను అప్‌లోడు చేస్తూ, మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని చెబుతోంది. కాంట్రాక్టు విభాగంలో ఉన్నందున సమ్మెకు అనుమతి లేదని.. తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మెను విరమించబోమని స్పష్టం చేస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విలేజ్ హెల్త్ క్లినిక్(సబ్‌సెంటర్లు)ల్లో పని చేస్తున్న సీహెచ్‌వోలు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మన్యం జిల్లాలోని 282 సబ్‌సెంటర్లలో విధులను బహిష్కరించి, నిరవధిక సమ్మెలోకి దిగారు. వీరి ఆందోళనలతో గ్రామాల్లో వైద్యసేవలు నిలిచిపోయాయి. సీహెచ్‌వోల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, మరింత రెచ్చగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీరి పట్ల దురుసు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. తాజాగా ప్రభుత్వం వీరందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. తక్షణమే విధుల్లో చేరకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతోంది.
ఇన్సెంటివ్ ఇస్తామంటూనే మెలిక..
సీహెచ్‌వోల ప్రధాన డిమాండ్లలో ఇన్సెంటివ్ ఒకటి. గతంలో ఇచ్చిన రూ.15 వేలు ఇన్సెంటివ్‌ను ప్రస్తుతం తగ్గించడంతో పాటు.. నెలల తరబడి ప్రభుత్వం బకాయిలు ఉంచుతోంది. సమ్మెను విరమించుకోవాలని, ఆరు నెలల ఇన్సెంటివ్ బకాయిలు చెల్లిస్తామని తాజాగా చెబుతోంది. ఇక్కడే మరో మెలిక పెట్టింది. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల్లో ఉండాలని అంటోంది. 8 గంటలకు పని చేసే కేంద్రంలోనే ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాలని మరో నోటీసు పంపింది. దీనిపై సీహెచ్‌వోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 282 సబ్ సెంటర్లలో 80 కేంద్రాలకు సొంత భవనాలు లేవు. 40 సెంటర్లకే కొత్త భవనాలు ఉన్నాయి. మిగతావి ప్రభుత్వ భవనాలైనప్పటికీ అరకొర సదుపాయాలే. సచివాలయాలు, గ్రంథాలయాల్లో ఉంటున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేవు. దాదాపు అన్ని చోట్లా ఊరి చివర, శ్మశానాలకు దగ్గరలో ఉన్నవే. అక్కడ ఆడపిల్లలు ఎలా ఉండగలరని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది మద్యం తాగి వస్తుంటారని.. ఇప్పటికే కొన్నిచోట్ల దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8 గంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్ వేసే వెళ్లాలంటున్నారని.. గిరిజన ప్రాంతాల్లో అసలు సిగ్నల్సే రావని చెబుతున్నారు. అలా ఉంటేనే రూ.5 వేలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. జీతాల పెంపు, ఇన్సెంటివ్, పీఎఫ్ పునరుద్ధరణ, అద్దె, ఇతర బిల్లుల బకాయిల చెల్లింపు, జాబ్ చార్ట్ వంటి డిమాండ్లపై స్పందించకుండా.. మొత్తం 11 గంటలు కచ్చితంగా డ్యూటీ చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
సమ్మె ఆపేది లేదు..
మా డిమాండ్లపై స్పందించాల్సింది పోయి, నోటీసులు ఇస్తున్నారు. దానికి మేం వివరణ కూడా ఇచ్చాం. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల్లో ఉండాలంటున్నారు. ఇది సమంజసమేనా? కార్మిక చట్టాలు మాకు వర్తించవా?
– ఎం.ఇంద్రాణి, సీహెచ్‌వో,
ఏపీఎంసీఏ జిల్లా సంయుక్త కార్యదర్శి
నోటీసులిస్తున్నారు..
మా సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. దీనికి తోడు నోటీసులిచ్చి, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, కేవలం ఆరు నెలల బకాయి ఇన్సెంటివ్‌ను మాత్రమే చెల్లిస్తామని చెబుతున్నారు. 11 గంటల పాటు విధుల్లో ఉండాలని, హెడ్ క్వార్టర్స్‌లో రాత్రి 8 గంటలప్పుడు ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాలని కొత్తగా మెలిక పెట్టారు. మాలో చాలామంది మహిళలే. అంతవరకు ఊరి చివర కేంద్రాల వద్ద ఎలా ఉండగలం?
– ఎస్.రాజేశ్వరి, సీహెచ్‌వో,
ఏపీఎంసీఏ జిల్లా కోశాధికారి
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన సీహెచ్‌వోలకు కూటమి ప్రభుత్వం కొత్త వేధింపులు మొదలు పెట్టింది. సమ్మెకు వెళ్లిన వారితో సామరస్య పూర్వకంగా చర్చలకు పిలిచి పరిష్కరించాల్సింది పోయి అడ్డదారిలో కొత్తగా మెలికలు పెడుతూ వేధిస్తోంది. షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయాలని మెలిక పెట్టింది. విధుల నుంచి వెళ్లే సమయంలో పని చేసే కేంద్రంలోనే ఎఫ్‌ఆర్‌ఎస్ వేసే వెళ్లాలని నోటీసులు పంపింది. దీంతో ఇది సాధ్యమేనా.. అని సీహెచ్‌వోలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
పలువురు సీహెచ్‌వోలకు షోకాజ్ నోటీసులు
రాత్రి 8 గంటల వరకు విధుల్లో ఉండాలని మెలిక
సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర
సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర
సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర


