నరసరావుపేట రూరల్: అనారోగ్యంతో మృతి చెందిన మహిళ కళ్లను దానం చేయడంతో ఇద్దరికీ కంటిచూపు పొందే అవకాశం లభించింది. నేత్రదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు మానవత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన కానుగుల సైదమ్మ (36) ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మరణానంతరం కార్నియాలను దానం చేస్తే మరొకరికి చూపు లభించే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులకు అమ్మ శరీర అవయవ దాన ప్రోత్సాహకుల సంఘం జిల్లా కోఆర్డినేటర్ చలపతిరావు అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో కార్నియా దాన ప్రక్రియ చేపట్టారు. మరణానంతరం శరీర భాగాలను దానం చేయడం ద్వారా ఇతరులకు మేలు చేయవచ్చని వివరించారు. మృతదేహాన్ని దహనం చేసినప్పుడు లేదా ఖననం చేసినప్పుడు ఉపయోగపడే అవకాశం ఉన్న శరీర భాగాలు వృథా అవుతున్నాయని, వాటిని దానం చేయడంపై ప్రజలు అపోహలు వీడి ముందుకు రావాలని చలపతిరావు సూచించారు. అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మృతురాలి భర్త కానుగుల ఆంజనేయులు, కుమారుడు కర్మల బాబు, బంధువులు సిరికొండ సైదులు, కోటేశ్వరరావు, శ్రీనివాసులు, వేములయ్య పాల్గొన్నారు.


