హరిత మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

హరిత మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

హరిత మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

మాచర్ల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన

మాచర్ల రూరల్‌: తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త, అత్త, మామలైన దోషుల పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించిన సంఘటన శనివారం జరిగింది. వివరాలలోకి వెళితే.. మండల పరిధిలోని రాయవరం గ్రామానికి చెందిన బత్తుల హరిత శుక్రవారం అనుమానాస్పదంగా ఉరి వేసుకొన్న సంఘటన పై ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. హరితది ఆత్మహత్య కాదు హత్యేనని, హరిత మృతికి ఆమె భర్త బత్తుల చంద్రశేఖర్‌, అత్త మామ మంగమ్మ, కాసులు తన కూతుర్ని వేధిచి చంపివేశారని మృతురాలి తల్లి చల్లా ఈశ్వరమ్మ ఆరోపించారు. మూడు నెలల గర్భిణీగా ఉన్న తన కూతురు బత్తుల హరిత ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని, భర్త, అత్తమామలు తరుచూ వేధింపులకు గురిచేస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నారని, వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. రాయవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల రాజకీయ ఒత్తిళ్లతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, నిందితుడి కుటుంబ సభ్యులకు స్టేషన్‌లో సకల సౌకర్యాలు కల్పించటం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిత మృతి పై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

వరకట్న వేధింపుల కేసు నమోదు చేశాం..

దీనిపై రూరల్‌ ఎస్‌ఐ వెంకట్‌ను వివరణ కోరగా.. బత్తుల హరిత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తాము భావించి కేసు నమోదు చేశామన్నారు. హరిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఆమె భర్త చంద్రశేఖర్‌, అత్త, మామల పై వరకట్న వేధింపు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్‌ తెలిపారు.

కబ్జాదారుల నుంచి

మా భూమిని కాపాడాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): తన భూమిని కాజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ పల్నాడు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మీడియా ఎదుట వాపోయింది. తన భూమిని బావాగ్ని ఆరామం ఆశ్రమం నిర్వాహకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితురాలు బెల్లపు సరోజిని మాట్లాడుతూ పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం సర్వే నంబరు 196లో 24 సెంట్ల భూమిని జీవనోపాధి నిమిత్తం మాజీ సీఎం ఎన్టీ రామారావు తమకు కేటాయించారని తెలిపారు. దశాబ్దాలుగా భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇటీవల తన భర్త మరణించారని, అక్కడి తహశీల్దార్‌ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసి అడంగల్‌ కాపీ కూడా ఇచ్చారని తెలిపారు. తన భూమికి పక్కనే ఉన్న ఆశ్రమం నిర్వాహకులు మత్తి కోటేశ్వరరావు, మత్తి సీతారామబాబు రాజకీయ పలుకుబడితో తన భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కొంతకాలంగా తనను పొలంలోకి వెళ్లకుండా అడ్డుపడుతూ వారు మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు. పొలంలో వ్యవసాయం చేయకుండా మొదట కొండ బండలను వేసి, ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఎర్ర మట్టిని పోసి చదును చేశారని వివరించారు. అధికారులు సైతం మఠం నిర్వాహకులకు సహకరిస్తున్నారన్నారు. ఇటీవల తమకు చెందిన భూమిని ’ఈ భూమి ప్రభుత్వం వారిది.. ఆక్రమించుకున్న వారు శిక్షార్హులు’ అని బోర్డు ఏర్పాటు చేశారని, ఈ విషయంపై గట్టిగా నిలబడటంతో అమరావతి పోలీసులు తనఇంటికి వచ్చి తన మనవడు నవీన్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయిస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ స్పందించి కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడి తనకు న్యాయం చేయాలని సరోజిని వేడుకున్నారు.

కారు డోర్‌ తగిలి వ్యక్తి మృతి

తెనాలిరూరల్‌: తెనాలి చెంచుపేటలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని కుమార్‌ పంప్స్‌ అండ్‌ మోటార్స్‌ సంస్థలో సత్యనారాయణ(56) సూపర్‌వైజర్‌గా, పినపాటి సేతుబాబు హెల్పర్‌గా పని చేస్తుంటాడు. మధ్యాహ్నం తమ విధులు ముగించుకుని భోజనం చేసేందుకు ద్వారకానగర్‌, మల్లెపాడులోని తమ నివాసాలకు ఒకే ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో చెంచుపేటలోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో రోడ్డుపై ఆగిన ఓ కారు డోర్‌ను ఒక్కసారిగా తీయడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ సత్యనారాయణ తుంటి భాగంపై నుంచి వెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. సేతుబాబుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, సత్యనారాయణ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. త్రీ టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement