సత్రశాల దేవస్థానంలో నంది విగ్రహం చోరీ | - | Sakshi
Sakshi News home page

సత్రశాల దేవస్థానంలో నంది విగ్రహం చోరీ

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

దేవస్థానంలోని పురాతన నంది విగ్రహాన్ని తస్కరించి, తమవెంట తెచ్చుకున్న నకిలీ విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచిన దొంగలు

దేవస్థానంలో పనిచేయని 12 సీసీ కెమెరాలు

పర్యవేక్షణ లోపాలపై భక్తుల తీవ్ర ఆగ్రహం

సత్రశాల(రెంటచింతల): పవిత్ర కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న అత్యంత పురాతనమైన ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో అంతరాలయంలో ప్రతిష్టించిన నంది విగ్రహం చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పురాతనమైన శైవక్షేత్రమైన దేవస్థానంలో చోరీ జరగడం ఇది నాలుగోసారి కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. సేకరించిన వివరాల ప్రకారం.. దేవస్థానం ప్రధాన అర్చకుడు మల్లిఖార్జున శర్మ ఈ నెల 8వ తేదీ గురువారం సెలవుపై వెళ్లగా దేవస్థానంలో ఆ రోజు కృష్ణప్రసాద్‌ శర్మ స్వామివార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈక్రమంలో గుర్తు తెలియని ఐదుగురు భక్తులు ముందుగా గర్భాలయంలో నున్న మల్లిఖార్జున స్వామివద్ద పూజలు చేసి అనంతరం అర్చకులతో కలిసి పక్కనే ఉన్న భ్రమరాంభికాదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేయాలని కోరగా వచ్చిన వారిలో కొందరు అర్చకులతో వెళ్లగా ఒకరు అక్కడే ఉండి అంతరాలయంలో ప్రతిష్టించిన నంది విగ్రహం తీసుకుని ముందుగా సంచిలో వారు తీసుకువచ్చిన వేరే నంది విగ్రహాన్ని అక్కడ ఉంచారు. అంతరాలయంలో చోరీకి గురైన నంది విగ్రహం కొలతలతో ఉన్న విగ్రహం వారి వెంట తెచ్చి ఈ చోరీకి పాల్పడటంతో వారు పలుమార్లు రెక్కీ చేసిఉంటారని అనుమానిస్తున్నారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు మల్లిఖార్జున శర్మ శుక్రవారం యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన సమయంలో నంది విగ్రహం మారిన విషయం గుర్తించి ఈఓ గాదె రామిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెలుగులోకి వచ్చింది. చోరీ జరిగిన విషయంపై ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శనివారం దేవస్థానం పరిసరాలను పరిశీలించారు. దేవస్థానం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పర్యవేక్షణ లోపాలు వెలుగులోకి వచ్చినట్లు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన దేవస్థానంలో వరుస చోరీలు జరుగుతుండటంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement