అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరారామక్షేత్రంలో శనివారం మహాలయ అమావాస్యను పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చి పితృదేవతలకు భక్తిశ్రద్ధలతో పితృకార్యాలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి జిల్లా నలుమూలల నుంచి పవిత్రకృష్ణానది తీరాన పితృకార్యాలు చేయటానికి తరలి వచ్చిన వేలాదిభక్తులతో అమరేశ్వర ఘాట్ కిక్కిరిసిపోయింది. బాధ్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయపక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య నాడు వేలాది మంది భక్తులు తొలుత పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి తమితల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసి ప్రత్యేకపూజలు నిర్వహించి పిండాలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఈసందర్భంగా అమరేశ్వరాలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మహాలయ అమావాస్య విశిష్టతను వివరించారు. జిల్లానలుమూలల నుంచి అమరావతికి వేలాదిగా భక్తులు రావటంతో పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి.
పుణ్యస్నానాలకు ఇబ్బంది పడ్డ భక్తులు...
అధికారుల మధ్య సమన్వయలోపం వల్ల పితృకార్యాలు నిర్వహించటానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు స్నానాలు ఆచరించటానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రతినెలా రెండవ శనివారం విద్యుత్ కోతల్లో భాగంగా ఉదయం 8గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో స్థానిక అమరుశ్వరాఘాట్‌లో కృష్ణానదిలో నీరు అందుబాటులోకి లేక ప్రత్యేకంగా స్నానాలకు కోసం ఏర్పాటు చేసిన షవర్లు పనిచేయలేదు. తీంతో భక్తులు కృష్ణానదిలో సుమారు ఫర్లాంగుదూరం వెళ్లి స్నానం చేసి రావాల్సి వచ్చింది.
కిటకిటలాడిన అమరేశ్వర ఘాట్


