సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేలా వినూత్న కార్యక్రమం చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కాసు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గొంతెత్తిన జనం పథకాల అమలు ఎప్పుడంటూ సోషల్ మీడియాలో అడుగుతున్న వారిపై అక్రమ కేసులు పల్నాడు జిల్లాలో ఇప్పటికే 15 మందిపై అక్రమ కేసులు పోలీసుల తీరుపై విస్తుపోతున్న ప్రజలు
ఎమ్మెల్యే యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు..
పల్నాడు జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: శాంతి భద్రతలను గాలికొదిలేశారు... ప్రశ్నించేవారే టార్గెట్‌గా అక్రమ కేసు లు నమోదు చేస్తున్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసు వ్యవస్థ అక్రమార్కులకు, అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారు. లక్షలాది మంది సాక్షిగా వేదికలపై ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు అమలు చేయమని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్‌గా వేధింపులకు పాల్పడుతున్నారు. నేరుగా పోలీసు స్టేషన్‌లకు పిలిచి బెదిరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, బైండోవర్ కేసులు నమోదు చే స్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలు పోలీసుల ద్వారా ప్రశ్నించేవారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
సెల్ఫీ ఛాలెంజ్‌తో వణుకు..
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ నిలదీసే కార్యక్రమానికి తెరతీశారు. ఇది ఒక వ్యక్తి నుంచి ఉద్యమంగా మారడం గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కోపం తెప్పించింది. ఇది ఇలాగే కొనసాగితే స్థానిక పోరులో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొవాల్సి వస్తుందనే భయంతో ఇటీవల తమ కార్యకర్తల సమావేశంలో నోరుజారి బూతులు మాట్లాడారు. అయితే ఆయన బూతులతోపాటు, వైఎస్సార్ సీపీ నాయకులను రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేసినా, ఆయనపై కేసు నమోదు చేయని పోలీసులు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ గౌరవంగా ప్రశ్నించిన వారిపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరింపులకు పాల్పడడం దారుణం. కాసును ఆదర్శంగా తీసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజలు సెల్ఫీ వీడియోద్వారా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారు. దీంతో కూటమి నేతల్లో వణుకు మొదలైంది. ఇది ఒక నియోజకవర్గం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్రానికి పాకుతుందని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు పోలీసులను అడ్డుపెట్టుకుని సెల్ఫీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ బైండోవర్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా పిడుగురాళ్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఇప్పటికే 15 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి, పోలీసు స్టేషన్‌కు పిలిచి బెదిరించడంతోపాటు, తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ ఛాలెంజ్‌లు చేస్తున్న వ్యక్తులపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించి ‘నా కొ..ల్లారా బట్టలు ఊడదీసి బజారుల్లో కొడతాం’ అంటూ కూటమి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే యరపతినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేగాక ఒక చేత్తో బాంబు పట్టి..మరో చేత్తో తుపాకీ పట్టి ఫ్యాక్షన్‌లో తిరిగాను.. నన్ను యరపతినేని శ్రీనుగా ఉండనీయ్యండి.. మంచికల్లు శ్రీనును చేయవద్దని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంపై సెల్ఫీ ఛాలెంజ్‌లు చేస్తున్న వ్యక్తులపై పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసి కేసులు పెట్టించాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటం వల్లే దాని నుంచి కార్యకర్తల దృష్టి మళ్లించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేలా యరపతినేని మాట్లాడారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


