వేమూరు: ఎలాంటి లోపాలు జరగకుండా రీ సర్వే పూర్తి చేయాలని రీ సర్వే ల్యాండ్ రికార్డు డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ అన్నారు. వేమూరు మండలం జంపని గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జంపని గ్రామంలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్ డిసెంబరు 15 కల్లా పూర్తి చేయాలని ఆయన సూచించారు. భూముల విస్తీర్ణం సరి చూసుకునేందుకు రైతులకు పలు సార్లు నోటీసు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ పి.పార్వతి, డీఎస్‌ఎల్‌ఓ శేషగిరిరావు, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టులో గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎదుర్కొంటున్న దాడులు, బెదిరింపులు, వేధింపుల నుంచి వారికి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాదుల భద్రతకు ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ మా హక్కు–రక్షణ చట్టం అమలు అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని న్యాయవాదులు స్పష్టం చేశారు. దీక్షలో న్యాయవాదులు జి.శివప్రసాద్‌రెడ్డి, ఎస్.బి.ఏ.ఝాన్సీ, ఎస్.కె యజదాన్ని బాషా, పి బాబురావు తదితరులు కూర్చున్నారు. వీరికి పలువురు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
పెదకాకాని: పెదకాకాని శివాలయంలో స్వామి వారి నిత్య కల్యాణ క్రతువు పునఃప్రారంభిస్తున్నట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సాధారణ సమావేశం నిర్వహించారు. కొంతకాలంగా నిలిచిపోయిన భ్రమరాంబ మల్లేశ్వరస్వామి నిత్య కల్యాణ క్రతువు, నూతనంగా ప్రతి మాస శివరాత్రి ప్రదోషకాలంలో నందీశ్వరస్వామి అభిషేకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పాలకవర్గం పలు తీర్మానాలు ఆమోదించింది. అనంతరం దేవస్థాన జమా,ఖర్చులను ఆమోదించారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు చేబ్రోలు వెంకట భాస్కర పున్నారావు, కంభంపాటి వెంకయ్య, కొమ్మూరి మల్లికార్జునరావు, కొండలత, వుల్లం రాజేశ్వరి, బండారు మల్లేశ్వరి, పాముదుర్తి నాగలక్ష్మి, ఎక్స్ అఫిషియో సభ్యులు పేటేటి ధనమహేశ్వర ప్రసాద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చీరాల రూరల్: ఆంధ్ర ప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల రామాపురం బీచ్‌లో ఈనెల 9, 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బీచ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు, నాలుగు జిల్లాల నల్లమల జోన్ ఇన్‌చార్జి నూతలపాటి దేవదాసు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 17 జిల్లాల నుంచి ఆయా ఫుట్‌బాల్ అసోసియేషన్లకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఇక్కడ ప్రతిభ కరబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టులోకి తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరుకానున్నట్లు చెప్పారు. చీరాలలో బీచ్ ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించడం ఇదే ప్రథమమని క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను తిలకించాలని కోరారు.


