వాహన యాజమానుల పేర్ల బదిలీలకు తప్పని అవస్థలు ‘డెమోగ్రాఫిక్ ఎర్రర్’తో ఆందోళన చెందుతున్న డ్రైవర్లు ప్రమాదం జరిగితే ఇన్స్యూరెన్స్‌పై వాహనదారులు బెంబేలు జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తుల పెండింగ్
జిల్లాలో వేలసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్
నెల రోజులుగా పనిచేయని డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యువల్
సత్తెనపల్లికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ ఈ నెల 3తో ముగిసిన తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయించుకునేందుకు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లగా తండ్రి పేరు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌లో ఒక అక్షరం తేడా ఉందని సవరించుకోవాలని సలహా ఇచ్చారు. సవరించి లైసెన్స్ రెన్యువల్ చేయించుకునేందుకు సారధియాప్ నిలిచిపోవడంతో లైసెన్సు రెన్యువల్ కాలేదు. దీంతో ఐదు రోజులుగా విధులకు తీసుకోని పరిస్థితి.
రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన గంగాభవాని తన మారుతి షిఫ్ట్ కారును రూ. 1.50 లక్షలకు బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంకు చెందిన శ్రీనుకు విక్రయించింది. తన పేరుతో ఉన్న కారును బదిలీ చేసేందుకు రవాణా శాఖ వాహన యాప్ పని చేయక గంగాభవానీ ఇబ్బందులు పడుతోంది. వీరిద్దరే కాదు జిల్లాలో వేలమందికి పైగా ఇలా నెల రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రక్రియ వేగవంతం
సత్తెనపల్లి: జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రెన్యువల్ కోసం.. వాహనాల రిజిస్ట్రేషన్ .. హెచ్‌పీ నోటింగ్, హెచ్‌పీ టెర్మినేట్, సేల్ టోకెన్ వంటి వాటికి దరఖాస్తు చేసుకుంటున్న డ్రైవర్లు, వాహనదారులకు ‘సారధి పరివార్, వాహన్ యాప్’ చుక్కలు చూపిస్తున్నాయి. గత నెల రోజులుగా ఈ యాప్‌ల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పునరుద్ధరణ, బది లీ ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గడువు ముగిసిన లైసెన్సులతోనే డ్రైవర్లు భయం భయంగా వాహనాలు నడపాల్సిన దుస్థితి దాపురించింది. ఒకవైపు కంప్యూటర్ సహకరించక పోవడం, మరోవైపు అధికారుల ఉదాసీనత వాహనదారులకు శాపంగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డెమోగ్రాఫిక్ ఎర్రర్‌తో సతమతం ..
ఆన్‌లైన్‌లో వంద దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తే అందులో నాలుగైదు కూడా పూర్తి కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు సమర్పించే సమయంలో స్క్రీన్ పై డెమోగ్రాఫిక్ ఎర్రర్ అని చూపిస్తూ ప్రక్రియ నిలిచిపోతుందని డ్రైవర్లు వాపోతున్నారు. ఏఐ ఆధారంగా జారీచేసే ఎల్‌ఎల్‌ఆర్, కొత్త డ్రైవింగ్ లైసెన్స్ జారీ జరుగుతున్నా .. పాత లైసెన్సుల రెన్యువల్, వాహనాల రిజిస్ట్రేషన్, హెచ్‌పీ నోటింగ్, హెచ్‌పీ టెర్మినేట్, సేల్ టోకెన్ వద్దే ఈ చిక్కులు వస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోని పేరు, ఇంటి పేరు వరుస క్రమానికి, డ్రైవింగ్ లైసెనన్స్ లోని వివరాలకు మధ్య చిన్నపాటి తేడా ఉన్నా కంప్యూటర్ తిరస్కరిస్తోంది. ఈ వివరాల సవరణ కోసం రవాణా శాఖ కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఉండడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అన్నివాహనాల డ్రైవర్లకు తప్పని ఇక్కట్లు
ఈ సాంకేతిక లోపం వల్ల ముఖ్యంగా ఆర్టీసీతో పాటు స్కూల్ బస్సు డ్రైవర్లు, లారీలు, టిప్పర్లు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు నడిపే డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, వివిధ రకాల లోడులతో సురక్షి తంగా చేర్చాల్సిన తమకు లైసెన్స్ రెన్యువల్ కాకపోవడం మానసిక వేదన కలిగిస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. ఇటు ఆర్టీసీ అధికారులు, అటు పాఠశాలల యాజమాన్యాలు, మరోవైపు వాహనయజమానుల ఒత్తిడి, ఇంకోవైపు రవాణాశాఖ కార్యాలయాల్లో పను లు కాకపోవడంతో నానా అవస్ధలు పడుతున్నారు.
స్పష్టత లేక...
బాధిత డ్రైవర్లు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లి విన్నవించుకుంటున్నా అధికారులు నామమాత్రంగానే తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ‘ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఢిల్లీ యాప్’ ప్రస్తుతం సర్వర్లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ జరుగుతోంది’ అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో స్పష్టత ఇవ్వడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను ద్విచక్రవాహనం, కారు నడిపేందుకు 2008 ఏప్రిల్‌లో లైసెన్స్ తీసుకున్నా. ఆ లైసెన్స్‌ను హెవీ లైసెన్స్‌గా మార్చుకునేందుకు యత్నిస్తే సారథి యాప్ పని చేయటం లేదు. ఇటీవల లారీ నడిపేందుకు వెళ్ళటంతో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా రూ.5 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
–కీసర గోపాలరెడ్డి, డ్రైవర్, నాగవరం, క్రోసూరు
జిల్లాలో రవాణాశాఖ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహనాల బదిలీల దర ఖాస్తులు నమోదవుతుంటాయి. సారథి పరివార్, వాహన్ యాప్‌లు సరిగ్గా పని చేయకపోవడంతో ప్రక్రియ పూర్తిగా మందగించింది. దీంతో జిల్లాలో నెల రోజులుగా పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఏకంగా వేల సంఖ్య దాటినట్లు తెలుస్తోంది. గడువు ముగిసే లోపు ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పోర్టల్‌లో అప్‌డేట్ కాకపోవడంతో వాహన దారులకు నిరాశే మిగులుతోంది.
యాప్‌ల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను అధిగమించేందుకు కేంద్ర రవాణా శాఖ దేశ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వేగవంతంగా చేస్తోంది. వాహనాలు కొన్నా, విక్రయించినా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే పని ఉండదు. పేరు, ఇంటి పేరు క్రమం ముందూ వెనుక ఉన్నప్పటికీ ఆటోమెటిక్‌గా కంప్యూటర్ స్వీకరించేలా యాప్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని అవుతున్నాయి. – జి.సంజీవ్‌కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి


