గుంటూరు జీజీహెచ్‌లో అధికారుల పక్షపాతం
కాంట్రాక్టు వైద్య సిబ్బంది టెంటు తొలగింపు స్పృహ తప్పి పడిపోయిన కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు రేణుక జూడాలకో న్యాయం.. మాకో న్యాయమా అంటూ నర్సింగ్ సిబ్బంది ఆవేదన జీజీహెచ్‌లో కొనసాగుతున్న కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది సమ్మె
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అధికారుల పక్షపాతంపై కాంట్రాక్టు వైద్య సిబ్బంది గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత మూడు రోజులుగా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు టెంట్ వేసుకుని సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం రాత్రి ఆసుపత్రి అధికారులు కాంట్రాక్టు సిబ్బంది వేసుకున్న టెంట్‌ను తొలగించారు. దీంతో గురువారం ఎండలోనే కాంట్రాక్టు వైద్య సిబ్బంది బైఠాయించి తమ నిరసన కొనసాగించారు. ఈక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న వై. రేణుక సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో నర్సింగ్ సిబ్బంది ఆమెకు తక్షణమే ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆసుపత్రి అధికారుల పక్షపాత ధోరణి వల్లే తాము ఎండలో ఉండి ఇలా నిరసన కొనసాగిస్తూ ఇబ్బంది పడాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.
మద్దతు లేకపోగా.. భగ్నం చేసే కుట్ర
గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు స్టయిఫండ్ పెంచాలని కోరుతూ ఆగస్టులో నెలరోజులకు పైగా సమ్మె చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట టెంట్ వేసుకుని ప్రతిరోజూ నిరసనలు చేశారు. అత్యవసర వైద్య సేవలు కూడా బహిష్కరించి సమ్మె చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు, సీనియర్ వైద్యులు, మెడికోలు అందరూ కూడా జూనియర్ డాక్టర్లకు మద్దతు పలికారు. ఏరోజు వారిని టెంట్ తీసివేయాలని ఆదేశించలేదు. డాక్టర్ల పిల్లలే వైద్యులుగా ఉండటంతో సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంఓ, ఇతర ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లు ఎవరూ కూడా విభేదించకుండా జూనియర్ డాక్టర్లకు తమవంతు మద్దతు తెలిపి వారి డిమాండ్ నెరవేర్చుకునేందుకు సహాయ సహకారాలు అందజేశారు. కానీ కాంట్రాక్టు వైద్య సిబ్బంది టెంట్ వేసుకుని కేవలం మూడు రోజుల నిరసన కార్యక్రమం చేయగానే వివక్ష చూపిస్తూ అర్ధరాత్రి ఎవరూలేని సమయంలో ఆసుపత్రి అధికారులు టెంట్ పీకించివేశారు. దీనిపై కాంట్రాక్టు సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారుల నుంచి వారికి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గత్యంతరం లేక ఎండలోనే సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఎండలోనే బైఠాయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కొనసాగించారు. ఈక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు రేణుక స్పృహ తప్పి పడిపోయింది. ఆసుపత్రి అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము తమ న్యాయబద్ధమైన డిమాండ్‌లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ నేతలు స్పష్టం చేశారు.


