సమన్వయంతో దసరా ఉత్సవ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో దసరా ఉత్సవ ఏర్పాట్లు

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, సులభతరంగా దుర్గమ్మ దర్శనం చేయించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్‌ లక్ష్మీశ, పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈఓ శీనానాయక్‌ శనివారం పరిశీలించారు. తొలుత సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయం, పూల మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న హోల్డింగ్‌ పాయింట్లను అధికారులు సందర్శించారు. అనంతరం వినాయకుడి గుడి వద్ద జరుగుతున్న క్యూలైన్‌ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రథం సెంటర్‌, టోల్‌గేట్‌, ఘాట్‌రోడ్డుతో పాటు కనకదుర్గనగర్‌ వద్ద ప్రసాదాల కౌంటర్లు, గోశాల వద్ద జరుగుతున్న క్యూలైన్‌ పనులను పరిశీలించారు.

భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనలో రాజీ లేదు

దసరా ఉత్సవాలను పరిశీలించిన అనంతరం దుర్గగుడి ఆవరణలోని రాజగోపురం వద్ద కలెక్టర్‌ లక్ష్మీశ మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనలో రాజీ ఉండదన్నారు. 24 గంటలు పని చేసేలా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పద్మావతి, సీతమ్మ వారి పాదాల వద్ద భక్తుల కోసం జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నగరంలో మొత్తం 22 పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నామని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. 3,500 మంది పోలీసు సిబ్బంది ఉత్సవాల విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. స్వచ్ఛ దసరా స్ఫూర్తితో కార్పొరేషన్‌ పరంగా శానిటేషన్‌, తాగునీరు, మరుగుదోడ్ల ఏర్పాటుకు చేస్తున్నామని మునిసిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర పేర్కొన్నారు. అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ శీనానాయక్‌ తెలిపారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, దేవదాయ శాఖ, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement