పిడుగురాళ్ల రూరల్ పిడుగురాళ్లలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులు, వైద్య సేవలను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి ఇన్–పేషెంట్ బ్లాక్, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లతోపాటు, విండోస్, సీలింగ్, ఎలక్ట్రికల్ పనులన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలని ఆదేశించారు. విద్యార్థులకు అత్యంత కీలకమైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మెడికల్, నర్సింగ్ విద్యార్థుల సౌకర్యార్థం వెంటనే మెస్ కోసం టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పనుల్లో వేగం పెంచేందుకు అన్ని విభాగాల్లోనూ మ్యాన్ పవర్‌ను (సిబ్బందిని) మరింత పెంచాలని అన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ గోవిందు, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, వైద్యశాల సూపరింటెండెంట్ గౌరీ, ఆర్డిఓ మురళి, విమల శాఖల అధికారులు, మెగా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


