పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలతో రైతులపై భారం సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడంపైనా అనుమానాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో గతేడాది అన్ని పంటలలో నష్టాలు గిట్టుబాటు ధరలు కల్పించడంలో సర్కార్ దారుణంగా విఫలం
అప్పులు తెచ్చి పెట్టుబడి
రాయితీ ఇచ్చి ఆదుకోవాలి
అమరావతి: గత సంవత్సరం ప్రకృతి అనుకూలించక పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు భారీగా నష్టపోయారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు పెరగటంతో ఖరీఫ్ సీజన్లో వారిపై పెనుభారం పడనుంది. సకాలంలో విత్తనాలను సరఫరా చేయటానికి కార్యాచరణ లేకపోవడం చూస్తే ఈ ఏడాది పరిస్థితి అర్థం అవుతోంది. నాసిరకం విత్తనాలను గ్రామాలలో విక్రయించకుండా అరికట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. వ్యవసాయ శాఖ అవగాహన సమావేశాలను నిర్వహణ, ప్రకటనలకే పరిమితం అవుతోంది. పత్తి, మిర్చి విత్తనాల ధరలపై రైతులు అందోళన చెందుతున్నారు. పురుగు మందులలో కూడా కొన్ని రకాల వాటి ధరలు రెట్టింపయ్యాయి. ఎరువుల విషయంలో ఈ సంవత్సరం అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈ సారి కూడా యూరియా తదితరాలకు కొరత ఏర్పడి బ్లాకులో అధిక రేట్లకు విక్రయించే పరిస్థితి వస్తే రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుంది. పత్తి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 8 వేలు – రూ. 10 వేలు, మిరపకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అదనంగా ఖర్చయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం, బ్యాంకులు, వ్యవసాయ రుణాల పంపిణీపై ప్రణాళిక రూపొందించిన దాఖలాలు లేవు. ఇన్ని ఖర్చులు భరించినా రైతులకు వాతావరణం అనుకూలించక పోవటం, గిట్టుబాటు ధరలు లేకపోవటం వంటి సమస్యలతో ప్రతి సంవత్సరం నష్టపోయే పరిస్థితి వస్తోంది. దీంతో వ్యవసాయంపై ఆసక్తి చూపకపోవటంతో కౌలు పొలాలకు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
పత్తి సాగుకు ఇబ్బందులు
గతంలో ఎకరా పత్తి సాగు చేయటానికి రూ.15 వేలు – రూ. 20 వేల వరకు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం రూ. 25 వేలు – రూ. 35 వేల వరకు ఖర్చు అవుతుంది. గతంలో పత్తి పంట ఎకరాకు సుమారుగా 20 నుంచి 25 క్వింటాళ్లుగా సగటున దిగుబడి వచ్చేది. ప్రస్తుతం గులాబి రంగు పురుగు, నాందేడ్ తెగులుతోపాటుగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఏ ఏటికాయేడు దిగుబడి తగ్గుతూ వస్తోంది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుండటంతో రైతులు పత్తి సాగుకు ఆసక్తి చూపటం లేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి రైతులను గిట్టుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎరువులు, పురుగుమందులపై సబ్సిడీ ఇచ్చి ఆదుకోకుంటే తమకు నష్టాలు తప్పవనే ఆందోళన రైతుల్లో నెలకొంది.
గతేడాది వాతావరణం అనుకూలించకపోవటంతో పత్తిలో దిగుబడి రాక నష్టపోయాం. ఏటా విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల ధరలు పెరగటంతో వ్యవసాయంలో పెట్టుబడి అధికమైంది. దీంతో బ్యాంకులలో తెచ్చిన అప్పులు చాలక ప్రైవేటుగా పెట్టుబడికి అప్పు తేవాల్సి పరిస్థితి నెలకొంది.
– అద్దంకి హనుమంతరావు, రైతు, ఎండ్రాయి
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు సొసైటీల ద్వారా సబ్సిడీ ఇవ్వాలి. అలాగే దిగుబడి తగ్గిన నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే కొంతమేర లాభం ఉంటుంది. ఎరువుల కొరత లేకుండా చూడటంతోపాటు వాటి ధరలు, పురుగుమందులు అధిక రేట్లకు అమ్మకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– గుబ్బా కృష్ణయ్య, రైతు, వైకుంఠపురం


