ఇంధన సమస్య లేకుండా చర్యలు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. డీజిల్ దొరక్క రైతులు, రవాణా దారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతబడ్డాయి. శనివారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతను చాటుతుంది. ఇక రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందేమోనన్నా ఆందోళనతో వాహనదారులు ట్యాంక్‌లను ఇందనంతో నింపుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద బారులుతీరిన వాహనదారులతో రద్దీ నెలకొంది. కొన్ని పెట్రోల్ బంక్‌ల్లో డీజిల్‌ను పూర్తిగా నిలిపి వేసి నోస్టాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. పెట్రోల్ మాత్రమే విక్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 135 పైగా పెట్రోలు బంక్‌లు ఉండగా డిమాండ్‌కు సరిపడా సరఫరా అందించలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. రోజుకు సుమారు 7 లక్షల లీటర్ల డీజీల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్న పల్నాడు జిల్లాలో కంపెనీల నుంచి సరఫరా అంతరాయం ఏర్పడటంతో సంక్షోభం మరింత ముదిరింది. హైవే పై రవాణా చేస్తూ డీజిల్ కోసం బంకులవద్దకు వెళ్లిన వాహనదారులకు నోస్టాక్ బోర్డు దర్శనం ఇవ్వటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాల్లో డీజిల్ అయిపోవటంతో వాహనాలను పక్కన పార్క్ చేసుకొని ఇంధన సేకరణ కోసం యజమానులు నానా అగచాట్లు పడటం కనిపించింది.
రైతాంగానికి గట్టిదెబ్బ..
డీజిల్ కొరత రైతాంగానికి గట్టిగా దెబ్బతీసింది. ఇంధనం లేక వరికోత యంత్రాలు నిలిచిపోవటంతో పంట కోత పనులు ఆగిపోయాయి. దీంతో పాటు మొక్కజొన్న కోతకు ఆటంకం కలిగింది. ఇక రవాణా రంగ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో సుమారు 2500 లారీల ద్వారా జరుగుతున్న ఇసుక రవాణ నిలిచిపోయింది. ఇలానే కొనసాగితే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది.
పెట్రోల్ బంకుల్లో ఎక్కడైనా ఇంధన నిల్వలు అడుగంటి ఉంటే వాటి వివరాలు సేకరించి మార్కెట్ ఏజెన్సీలతో మాట్లాడి సకాలంలో ఆయిల్ నిల్వల లోడ్‌లను పంపించేందుకు తగు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడైతే రైతులకు డీజిల్ అవసరం ఉందో అక్కడ పెట్రోల్ బంకులకు పది శాతం అదనంగా ఇంధనం పంపించటం జరుగుతుంది.
– కృతికా శుక్లా, పల్నాడు జిల్లా కలెక్టర్
పల్నాడు జిల్లాలో చమురు మంటలు
పెట్రోల్, డీజిల్ కోసం ప్రజల పాట్లు
ఉదయం నుంచి పెట్రోల్
బంకుల వద్ద క్యూ
జిల్లాలో 135కు పైగా పెట్రోల్ బంక్‌లు
సగటునా 7 లక్షల లీటర్ల డీజిల్
వినియోగం
6 లక్షల లీటర్ల పెట్రోల్ వాడకం
కంపెనీల నుంచి పూర్తి స్థాయిలో
సరఫరా కానీ ఇంధనం
కీలక సమయంలో డీజిల్
అందక రైతుల ఇక్కట్లు
ముందుకు కదలని వరి,
మొక్కజొన్న కోత యంత్రాలు


