అధిక ఉష్ణోగ్రతలపై జాగ్రత్తలు అవసరం | - | Sakshi
Sakshi News home page

అధిక ఉష్ణోగ్రతలపై జాగ్రత్తలు అవసరం

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

నరసరావుపేట: ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సూచించారు. జిల్లాలోని రానున్న ఐదురోజులు అధిక ఉష్ణోగ్రతలు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసిన నేపథ్యంలో ప్రజలు వేసవి ఎండలు, వడగాడ్పుల నుంచి రక్షణకు అవసమైన జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

భూగర్భ జలమట్టం పెంచాలి

జలధార – జలహరతి పథకం ద్వారా జిల్లాలో 10 రోజుల్లోగా భూగర్భ జలంమట్టం పెంపుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాల్వల పూడిక తీత, చెరువుల అనుసంధానం, నీటి పథకాల మరమ్మతులు వంటి ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందాలన్నారు. భూగర్భ జలమట్టం ఆందోళనకర స్థాయిలో ఉన్న బొల్లాపల్లి, మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, కారంపూడి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల, వినుకొండ మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉపాధిహామీ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకూ నిధులను జలధార–జలహారతి కోసం వినియోగించాలన్నారు. నీటిమట్టం కొలతల్లో ప్రామాణికంగా ఉండేందుకు నూతన పీజో మీటర్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

9న మూడో గ్రామ ఆరోగ్యదర్శిని

ఈనెల 9న జిల్లా వ్యాప్తంగా ప్రతి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయంలో గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వడగాలుల నుంచి జాగ్రత్తలు, ప్రతి బాలికకూ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ నినాదంతో జిల్లాలో మూడవ గ్రామ ఆరోగ్య దర్శిని నిర్వహించాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రవి, ఐసీడీఎస్‌ పీడీ ఉమాదేవి, వెబెక్స్‌ ద్వారా జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫుడ్‌ యూనిట్ల స్థాపనకు రాయితీ

నరసరావుపేట: జిల్లాలో వ్యక్తిగతంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు స్థాపించే వారికి 35శాతం రాయితీపై గరిష్ఠగా రూ.10 లక్షలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.3 కోట్ల వరకు ఇస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ యూనిట్ల స్థాపనపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకటరావు, యంగ్‌ ప్రొఫెషనల్స్‌, ఏపీ ఫుడ్‌ ప్రొసెసింగ్‌ సొసైటీ అధికారి పుష్య, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, ఎల్‌డీఎం, డీడీఎం, డీఏఓ పాల్గొన్నారు.

22–ఏ నిషేధిత భూముల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి

జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 22ఏ నిషేధిత భూముల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహాతో కలిసి 22ఏ నిషేధిత భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేసును నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టి నివేదికలను సమర్పించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement