ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడు మృతి

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

సత్తెనపల్లి: స్నేహితులతో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతై మృతిచెందిన సంఘటన సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు సమీపంలోని అమరావతి మేజర్‌ కాలువ లాకుల వద్ద మంగళవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగన్నకుంట ఏరియాకు చెందిన మదిర, శ్రీదుర్గస్వామి దంపతులకు కుమారుడు గిరీష్‌, కుమార్తె హర్షిత ఉన్నారు. పదవ తరగతి చదువుకున్న గిరీష్‌ (17) స్థానికంగా ఇస్తారాకుల దుకాణంలో పనిచేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. గిరీష్‌ తన స్నేహితులు గొల్లపల్లి శ్యాలేమ్‌ రాజు, రాజవరపు మణికంఠ, పెద్దింటి నాగమురళిలతో కలిసి ఈత కొట్టేందుకు అమరావతి మేజర్‌ కెనాల్‌ కాలువ వద్దకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల మదిర గిరీష్‌ గల్లంతయ్యాడు. ఎంత వెతుకులాడినా కనిపించకపోవడంతో సత్తెనపల్లి రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా, మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో మదిర గిరీష్‌ మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులు శ్రీదుర్గ, స్వామి, సోదరి హర్షిత, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. గంతమ్మ తల్లి నీకు మేము ఏం తక్కువ చేశామమ్మా అంటూ రోదించారు. ఒక్కగానొక్కడు వంశోద్ధారకుడు ఇక లేడనే వార్తను ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారి రోదన చూపరులను కంటితడికి గురిచేసింది. మదిర గిరీష్‌ మృతదేహానికి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement