చెరువులో పడి అన్నదమ్ములు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి అన్నదమ్ములు దుర్మరణం

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

● గొర్రెలకు నీళ్లు తాపుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాత ● కాపాడేందుకు చేసిన యత్నాలు విఫలం ● సారంగపల్లి అగ్రహారంలో అలుముకున్న విషాద ఛాయలు

దాచేపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన మంగళవారం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారంలో జరిగింది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సేకరించిన వివరాల ప్రకారం.. సారంగపల్లి అగ్రహారంకి చెందిన మోటుపోతుల శ్రీను(32), శ్రీకాంత్‌(18)లు వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరూ గొర్రెలను మేపుకొంటూ జీవనం సాగిస్తుంటారు. ఈక్రమంలో మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలోని అడవిలో గొర్రెలను మేపేందుకు వెళ్లారు. గొర్రెలకు నీళ్లు తాపించేందుకు కొత్తూరు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. చెరువులో గొర్రెలు నీళ్లు తాగుతుండగా వాటిని ఒడ్డు ఎక్కించేందుకు శ్రీను చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో శ్రీను కాలుజారి చెరువులోని పూడికలోకి దిగాడు. చెరువు నీటిలో మునుగుతున్న శ్రీనును కాపాడేందుకు తమ్ముడైన శ్రీకాంత్‌ నీటిలో దిగి కాపాడే ప్రయత్నం చేయగా అతను కూడా పూడికలోకి జారాడు. వీరిద్దని శ్రీకాంత్‌ తండ్రి సైదయ్య రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. శ్రీను, శ్రీకాంత్‌ లు చెరువు నీళ్లలోనే మునిగి ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని సైదయ్య గ్రామస్తులు సమాచారం ఇవ్వటంతో భారీగా గ్రామస్తులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. నీటిలో మునిగిపోయిన శ్రీను, శ్రీకాంత్‌ మృతదేహాలను అతి కష్టం మీద ఒడ్డుకు తీశారు. ఎస్‌ఐ పాపారావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పాపారావు వెల్లడించారు. మృతుడు శ్రీనుకి భార్య, ఇద్దరు కుమారులు ఉండగా శ్రీకాంత్‌ అవివాహితుడు. అన్నదమ్ములు ఇద్దరు చెరువులో పడి మృతి చెందటం సారంగంపల్లి అగ్రహారం గ్రామంలో విషాదాన్ని నింపింది. బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాల పై పడి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement