రోడ్డు ప్రమాదంలో బిహార్‌ కార్మికుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బిహార్‌ కార్మికుడు దుర్మరణం

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

యడ్లపాడు: ఉపాధి వెతుక్కుంటూ పొట్టచేతబట్టుకుని వచ్చిన ఆ వలస కార్మికుడిని విధి వంచించింది. కొత్త ఆశలతో వచ్చిన మొదటి రోజే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అతడిని కబళించింది. వంకాయలపాడు జైన్‌ మందిరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బిహార్‌కు చెందిన బాగీబింద్‌ (47) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం కై మూర్‌ జిల్లాకు చెందిన బాగీబింద్‌, తన బాబాయ్‌ కుమారుడు సురేష్‌ కుమార్‌ పనిచేస్తున్న వంకాయలపాడు గ్రామంలోని బి.శ్రీనివాసరావు పవర్‌ కన్‌స్ట్రక్షన్‌ (స్తంభాల) కంపెనీలో కూలీగా చేరేందుకు సోమవారం సాయంత్రం వచ్చాడు. మరుసటి రోజు నుంచే పనిలో చేరాలని యాజమాన్యంతో మాట్లాడి ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. తన సామాను గదిలో ఉంచి, బయటకు వెళ్లిన బాగీబింద్‌ రాత్రంతా తిరిగి రాలేదు.

ప్రమాదం జరిగిందిలా..

సోమవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో వంకాయలపాడు జైన్‌ మందిరం సమీపంలోని సర్వీస్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బాగీబింద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ మంగళవారం బాగీబింద్‌ తుదిశ్వాస విడిచాడు. మంగళవారం ఉదయం సోషల్‌ మీడియాలో వచ్చిన సమాచారం ద్వారా విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. రోడ్డుపై రక్తపు మరకలు, అక్కడే బాగీబింద్‌ ఫోన్‌, షూ పడి ఉండటాన్ని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మృతుని తమ్ముడి కుమారుడు సురేష్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

పొట్ట చేతబట్టుకుని వచ్చిన

తొలిరోజే అనంతలోకాలకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement