ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

నరసరావుపేట: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 28న రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. స్థానిక స్టేషన్‌రోడ్డు గాంధీ పార్క్‌ వద్ద ధర్నా చౌక్‌లో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం ‘‘రణభేరి 3.0’’ సందర్భంగా నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. 12వ పీఆర్‌సీ అమలు, పెండింగ్‌ డీఏలు, బకాయిల చెల్లింపు, మెమో–57 అమలు, హెల్త్‌ స్కీమ్‌ వంటి కీలక అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పీఆర్‌సీ అమలులో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, ఇప్పటికే 30 నెలలకు పైగా ప్రయోజనాలు కోల్పోయామని తెలిపారు. డీఏలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, సరెండర్‌ లీవ్‌ బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యా రంగంపై తగిన నిధులు ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు అధిక ఫీజులతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టత లేకపోవడం, తాత్కాలిక ఉద్యోగాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆడిట్‌ కమిటీ మెంబర్‌ పి.ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పీఆర్‌సీ ఏర్పాటు, పెండింగ్‌ డీఏలు, బకాయిల చెల్లింపు, మెమో నెంబర్‌ 57 వర్తింపు, సీపీఎస్‌ రద్దు తదితర ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. 29శాతం ఐ.ఆర్‌ ప్రకటించి పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలన్నారు. కరోనా సమయంలో మరణించిన 953 పంచాయతీ రాజ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని అన్నారు. పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు కె.శ్రీనివాసరెడ్డి, మద్దుకూరి మోహనరావు, జిల్లా సహాధ్యక్షులు ఎ.భాగేశ్వరిదేవి, జెవిడి వాల్యా నాయక్‌, గౌరవ అధ్యక్షులు షేక్‌ ఖాసీం పీరా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్‌.సుందరరావు, షేక్‌ అయేషా సుల్తానా ఆయా మండల అధ్యక్ష, కార్యదర్శులు, 250 మందికిపైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి ఆంజనేయనాయక్‌, ఏపీ ఎన్‌జీఓ–ఏపీ జేఏసీ పల్నాడు అధ్యక్షులు ఎం.రామకృష్ణ, ఆనంద్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఆదయ్య, ఏపీటీఎఫ్‌ 1938 పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు పమ్మి వెంకటరెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రేమ్‌కుమార్‌ నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపపజేశారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి, డీఈఓకు వినతిపత్రం అందజేశారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, గౌరవ అధ్యక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement