ఎస్సీ, ఎస్టీలపై కక్షసాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలపై కక్షసాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

నాదెండ్ల: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఉంటూ వారి మనోభావాలను దారుణంగా దెబ్బతిస్తోందని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. తూబాడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమెతో పాటూ సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూబాడుకు చెందిన టీజే సుధాకర్‌బాబు మాతృమూర్తి అన్నమ్మ రెండో వర్ధంతి సందర్భంగా పేదలు, గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అయితే వైద్యశిబిరం జరగకుండా అడ్డుకునేందుకు స్ధానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పోలీసులను పంపటం దుర్మార్గమన్నారు. మైక్‌ అనుమతి ఉందా... అంటూ సుధాకర్‌బాబుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అయితే పోలీసుల తీరును స్థానికులు నిరసించటంతో వారు వెనుదిరిగారని వివరించారు. 1970లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గ్రామంలో ఎన్నో పేద కుటుంబాలకు ఐదు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ కాలనీలో కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి, కాసు వెంగళరెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. కాలానుగుణంగా విగ్రహాలు లోతట్టుగా ఉండటంతో తిరిగి పునర్నిర్మించేందుకు మూడు విగ్రహాలను మరో ప్రదేశంలో భద్రపరచటం జరిగిందన్నారు. బుధవారం ముగ్గురు నేతల విగ్రహాలతో పాటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌, తలతోటి ఛార్లెస్‌ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ చేస్తుండగా అక్కడా అధికారులు, పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాట్లాడుతూ తూబాడు మహానుభావులకు పుట్టినిల్లన్నారు. తాను ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తాను ప్రజలకు సేవల చేశానే తప్ప ఎలాంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడలేదన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రజినీని గ్రామాల్లో రానీయకుండా, ఆమె ఫ్లెక్సీలు పెట్టనీయకుండా పోలీసులను అడ్డుపెట్టి రాజకీయాలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు ఎంతో తేడా ఉందని, అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్సార్‌సీపీ పాలనకు పోటీయే లేదన్న విషయం ప్రజలు ఇప్పటికే గుర్తించారన్నారు. కార్యక్రమంలో సర్పంచి గోళ్లమూడి కాశయ్య, గ్రామ నాయకులు గంగిరెడ్డి అప్పిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కనకరావు, అధికార ప్రతినిధి ఉడతా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

మాజీ మంత్రి విడదల రజిని

టీజేఆర్‌ మాతృమూర్తి వర్ధంతిని

అడ్డుకునేయత్నం దుర్మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement