చిలకలూరిపేట: ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర రాజకీయ,సాంస్క్రతిక, విద్య,వైద్య రాజకీయ శిక్షణ తరగతులు మే నెలలో ఐదు రోజుల పాటు కోటప్పకొండలో నిర్వహించనున్నారు. శిక్షణా తరగతుల నిర్వహణ కోసం పార్టీ నేతలతో కలసి కోటప్పకొండ ను సందర్శించి అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో కలసి బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్దిలో సైతం ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో విధ్వంసకర పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నించినవారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో ఆమడ దూరం కూడా పోలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ పొంగిపొర్లుతుంటే పల్నాడులో అనేక ప్రాంతాలు గుక్కెడు నీటికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే, లక్ష ఎకరాలకు సాగునీరు అందే వరికపుడిశెలకు దిక్కులేదుగాని, రూ.81 వేల కోట్లతో ఎక్కడో పోలవరం దగ్గర నుంచి కర్నూలు జిల్లా పెనకచర్లకు నీళ్లు తీసుకెళ్తామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 151 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకో వచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలని, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలా కాకుండా రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో నిధులు కేంద్రీకృతం చేస్తే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, యుగంధర్ పాల్గొన్నారు.
రాజధాని పేరుతో ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరణ తగదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
గుజ్జల ఈశ్వరయ్య


