నరసరావుపేట: ఉప సభాపతి పదవిలో కూర్చుని ఒక వర్గం కొమ్ముకాస్తూ దళితులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న రఘురామ కృష్ణంరాజు వైఖరి ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్‌పాల్ పేర్కొన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షుడు విస్తాల జయరావు ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాన్‌పాల్ మాట్లాడుతూ అసెంబ్లీలో అందరినీ సమానంగా చూడాల్సిన ఉప సభాపతి, వీధుల్లోకి వచ్చి కుల విద్వేషాలు రెచ్చగొట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రఘురామకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. ఆకివీడులో ప్రశాంతంగా ఉన్న దళితులపై దాడులు చేయించడమే కాకుండా తిరిగి బాధితులైన 57 మంది దళితులపైనే నాన్–బెయిలబుల్ కేసులు పెట్టించడం రఘురామ అరాచక పాలనకు పరాకాష్ట అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రఘురామ ’రాజరిక’ పాలనా అని ప్రశ్నించారు. ఆకివీడు దళితులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దళిత శక్తిని ఏకంచేసి అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి తెలిసేలా మా పోరాటం ఉంటుందని హెచ్చరించారు. నరసరావుపేట నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు సేవా సామేలు, మండల అధ్యక్షుడు ముచ్చు బ్రహ్మ పాల్గొన్నారు.
ఆకివీడు దళితులపై అక్రమ కేసులు
రద్దు చేయాలి
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు
డాక్టర్ గోదా జాన్‌పాల్


