సర్పంచ్‌ల పవర్‌కు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల పవర్‌కు చెక్‌

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

సర్పంచ్‌ల పవర్‌కు చెక్‌ మాట వినే వారికే అందలం! సత్తెనపల్లి: స్థానిక సంస్థల పదవీకాలం పూర్తవుతున్నా .. సకాలంలో ఎన్నికలు నిర్వహించని చంద్రబాబు ప్రభుత్వం .. వారి ‘పవర్‌’ను మాత్రం గడువు కన్నా ముందే లాగేసింది. పదవీకాలం ముగిసే సమయంలో పాలకవర్గాలు, పంచాయతీ అధికారులు కలసి వృథా ఖర్చులు చేస్తారనే సాకుతో సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను రద్దు చేసింది. పల్నాడు జిల్లాలో ఇప్పుడున్న సర్పంచ్‌లలో మూడొంతుల మందికి పైగా వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లాలో 529 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడొంతులకు పైగా పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులే విజయం సాధించారు. వీరి పదవీ కాలం గురువారంతో ముగియనుంది. అయితే ఆ గడువు ముగియకుండానే సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు చేస్తూ మార్చి 25నే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా పదవీకాలం ఇంకా ఉన్నప్పటికీ నేరుగా చెల్లింపులు చేసే అవకాశం సర్పంచ్‌లకు లేకుండా చేసింది. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులకు డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీడీఓ) అనుమతిని తప్పనిసరి చేసింది. సర్పంచ్‌లు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులకు థంబ్‌ వేస్తే మార్చి 24వ తేదీ వరకు నేరుగా ట్రెజరీకి వెళ్లేది. కానీ ఇప్పుడు డీడీఓ లాగిన్‌కు వెళుతుంది. ఆయన ఆ ఖర్చులు పరిశీలించి థంబ్‌ వేస్తేనే ట్రెజరీకి వెళుతుంది. పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు సొంత డబ్బులు ఖర్చు చేసి వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారు. తీరా ఇప్పుడు ఆ పనులకు డబ్బులు తీసుకునే వీలు లేకుండా ప్రభుత్వం మోకాలడ్డటంతో వారు మండిపడుతున్నారు. మార్చి నెలాఖరు కావడంతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి మరీ ఇంటి పన్నులు వసూలు చేయడంతో గ్రామపంచాయతీలకు పుష్కలంగా నిధులు సమకూరాయి. అయినప్పటికీ చేసిన ఖర్చులకు బిల్లులు పెట్టి డబ్బులు తీసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తాము గ్రామాల్లో పనులు చేస్తే ప్రభుత్వం తమ చెక్‌ పవర్‌ను నిలిపివేయడం తమను అవమానించడమేనని సర్పంచ్‌లు అంటున్నారు. తాము ఏదైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోవచ్చని కానీ ఏ తప్పు చేయకుండానే తమ చెక్‌ పవర్‌ నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

మూడు నుంచి పల్లెల్లోనూ ‘ప్రత్యేక’ పాలన...

పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్నా గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపని ప్రభుత్వం .. మరోవైపు ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఇదే విధంగా గ్రామపంచాయతీల్లో సైతం ఈనెల మూడు నుంచి ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ఈ మేరకు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు, ఇద్దరు ఎంఈఓలు, మండల వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మండల పరిషత్‌ పరిపాలన అధికారి(ఏఓ) వంటి వారిని నియమిస్తారు. మండల స్థాయిలో ఇంజినీరింగ్‌ అధికారులు ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం వారిని ప్రత్యేక అధికారులుగా నియమించే వీలు లేదు. వివిధ పనులకు సంబంధించి వారే ఎం.బుక్‌ చెక్‌ మెజర్‌మెంట్‌ చేస్తారు కాబట్టి, వారికే నిధులు ఖర్చు చేసే అవకాశం ఉండదు. కొన్ని మండలాల్లో రెండు మూడు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశాలుఉన్నాయి.

గ్రామాల్లో తమ మాట వినేవారినే ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఇప్పటికే ఆయా గ్రామాల్లోని కూటమి నాయకులు స్థానిక ఎమ్మెల్యేలకు మొరపెట్టుకుంటున్నారు. తమ మాట వినని అధికారులను నియమిస్తే గ్రామాల్లో తమ పరువు పోతుందని చెబుతున్నారు. ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో అత్యధిక గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులే విజయకేతనం ఎగురవేశారు. ఇప్పుడు వీరి పదవి కాలం ముగియనుండటంతో ఆయా పంచాయతీల్లో తిష్ట వేసేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. తాము చెప్పినట్టు పనిచేయకుంటే వేరే గ్రామానికి బదిలీ చేయిస్తామంటూ పంచాయతీ కార్యదర్శులను హెచ్చరిస్తున్నారు.

మాట వినే వారికే అందలం!

సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు

చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం

పంచాయతీలలో చెల్లింపులకు ఆంక్షలు

అత్యవసర చెల్లింపులకు

డీడీఓ అనుమతి తప్పనిసరి

మూడొంతులకు పైగా

వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌లే

ప్రభుత్వ ఉత్తర్వులతో

మండిపడుతున్న సర్పంచ్‌లు

పల్నాడు జిల్లాలో 529

గ్రామ పంచాయతీలు

బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

గ్రామ ప్రథమ పౌరులను అవమానించడమే...

సత్తెనపల్లి డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement