ఆలయ ఆస్తుల కబ్జాకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ఆలయ ఆస్తుల కబ్జాకు యత్నం

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

యడ్లపాడు: భక్తితో కొలిచే దేవుడి సొత్తుపైనే ఓ వ్యక్తి కన్నేశాడు. పదేళ్లుగా నమ్మిన భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ, ఆలయానికి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఉదంతం యడ్లపాడులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఆస్తుల విషయంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, కొనుగోలుదారులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది. ఆర్యవైశ్య సంఘం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగింది..

స్థానిక మెయిన్‌ సెంటర్‌లోని శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన సుమారు 4.05 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఆరు షాపుల కాంప్లెక్స్‌ను ఆర్యవైశ్య సంఘం పర్యవేక్షిస్తోంది. ఈ ఆలయానికి ఉప కోశాధికారిగా ఉన్న మద్దుల రమణారావు, పదేళ్లుగా ఆలయ వెండి, బంగారు ఆభరణాలతోపాటు అద్దె వసూళ్ల బాధ్యతలను చూస్తున్నాడు. అయితే ఇదే అదునుగా భావించిన రమణారావు, ఆ కాంప్లెక్స్‌ను తన పూర్వీకుల ఆస్తిగా రికార్డులు సృష్టించి, 2025లో తన భార్య శిరీష పేరిట గిఫ్ట్‌ డీడ్‌ చేయించుకున్నాడు. ఈ మోసం కాస్తా బ్యాంకు అధికారులు తనిఖీకి రావడంతో వెలుగులోకి వచ్చింది. ఆలయ సొమ్మును తాకట్టు పెట్టి రుణం పొందేందుకు అతను ప్రయత్నించినట్లు గుర్తించిన ఆర్యవైశ్య సంఘం గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోర్జరీ, ఆభరణాల దుర్వినియోగంపై కేసులు నమోదయ్యాయి.

కోర్టులో విచారణలో ఉండగానే..

ఈ వ్యవహారం కోర్టులో విచారణలో ఉండగానే, రమణారావు ఆ కాంప్లెక్స్‌ను మంగళగిరికి చెందిన కట్టెపోగు వెంకయ్య, నరిశెట్టి నారయ్యలకు విక్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వెంకయ్య తన అనుచరుడితో కలిసి షాపుల వద్దకు వచ్చి, అద్దెలు తమకే చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో వివాదం మొదలైంది. గ్రామస్తులు, సంఘ సభ్యులు వారిని నిలదీయగా, మంగళగిరి నుంచి వచ్చిన వ్యక్తులు దుర్భాషలాడుతూ దాడికి దిగారు. సమాచారం అందుకున్న యడ్లపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌న్‌కు తరలించి వివరాలను తెలుసుకుంటున్నారు. దేవుడి ఆస్తుల విషయంలో ఇంతటి మోసానికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సి ఉంది.

యడ్లపాడులో ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement