విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షించారు. ముందుగా కలెక్టర్ లాంచీలో నాగార్జునకొండకు చేరుకొని కొండలోని మ్యూజియం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి పనిముట్లు, సింహళ విహార్‌లోని మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించారు. నాగార్జునకొండ క్యూరేటర్ కమల్‌హాసన్ బుద్ధుని జీవిత చరిత్ర, చారిత్రక బౌద్ధ శిల్పాల గురించి కలెక్టర్‌కు వివరించారు. ఆమె పర్యాటక అవకాశాలను మరింత విస్తరించటానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాలన్నారు. విజయపురిసౌత్‌లోని హరిత రిసార్ట్స్ గదులను ఆధునీకరించాలన్నారు. కృష్ణా జలాశయంలో చిన్న బోట్లు ఏర్పాటు చేయటంతోపాటు వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయాలన్నారు. స్వదేశీ దర్శన్ చాలెంజ్ బేస్డ్ డెక్షినేషన్ డెవలెప్‌మెంట్ కింద జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, టూరిజం డీవీఎం కృష్ణచైతన్య, ఏపీటీడీసీ డీఈ కుమార్, మాచర్ల తహసీల్దార్ కిరణ్‌కుమార్, లాంచ్ యూనిట్ ఇన్‌చార్జి మస్తాన్ ఉన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 534.30 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి జలాశయానికి 5,184 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


