గత ఏడాది అక్టోబర్‌లో విరుచుకుపడిన ‘మోంథా’ నీట మునిగిన వరి, పత్తి, తదితర పంటలు జిల్లాలో మోంథా తుపాన్ నష్టం 1,730.25 హెక్టార్లుగా తేల్చిన యంత్రాంగం పరిహారం కోసం రైతులకు తప్పని ఎదురుచూపులు ఇప్పటి వరకూ నయాపైసా ఇవ్వని కూటమి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న జిల్లాలోని రైతులు
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం..వారికి అన్ని విధాలా అండగా ఉంటున్నాం .. అంటూ చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట నష్టం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా వారికి ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
నేను వ్యవసాయం చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నా. గత ప్రభుత్వంలో రైతు భరోసా ప్రతి ఏటా వచ్చేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ ఒక్కసారి కూడా రాలేదు. నాకు 52 సెంట్లు సొంత పొలం ఉంది. అలాంటప్పుడు నాకు అన్నదాత సుఖీభవ ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తే..నీ పేరుతో 10 సెంట్లు మాత్రమే పొలం ఉన్నట్లు చూపుతుందని సమాధానం ఇచ్చారు. నాకు 52 సెంట్లు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో అడంగల్, వన్‌బీ కాపీలు తీసుకొని ఇచ్చా. అయినా ఇంత వరకు అతీగతీలేదు.
– కాశిమాల ఓబయ్య, రైతు, గర్నెపూడి, సత్తెనపల్లి మండలం
సత్తెనపల్లి: కొద్ది రోజులు గడిస్తే ఖరీఫ్ పంట చేతికి అందుతుంది .. సరిగ్గా అదే తరుణంలో .. గతేడాది అక్టోబర్ నెలాఖరులో మోంథా తుపాన్ విరుచుకుపడింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మోంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని ప్రకటించి నేటికీ పరిహారం అందజేయక పోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందజేస్తే కనీసం రబీ సాగు ఖర్చులకు దోహదపడతాయని రైతులు ఆశగా ఎదురు చూశారు. రబీ ముగుస్తున్నా ఇంత వరకు పరిహారం అందలేదు. గత ఆరు నెలల కిందట మోంథా తుపాను దాటికి జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, మినప, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
1730.25 హెక్టార్లలో దెబ్బతిన్న పంట
జిల్లా వ్యాప్తంగా 1730.25 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు సర్వే చేసి అధికారులు లెక్కలు కట్టారు. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి పంటల నష్టాన్ని గుర్తించారు. జిల్లాలో 3,377 మంది రైతులు పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) అందుకునేందుకు అర్హులుగా గుర్తించి నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఆరు నెలలు గడుస్తున్నా నేటి వరకు నష్టపరిహారం అందజేయక పోవడంతో బాధిత రైతులు మౌనంగా రోదిస్తూ భారంగా ఎదురుచూస్తున్నారు.
రైతు కంట కన్నీరు
ఏటా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలు, తుపానుల కారణంగా చేతికొచ్చిన పంట ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి. దెబ్బతినగా మిగిలిన కొద్ది పంటలను విక్రయించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిహారం అందజేస్తే కొద్దిగా అయినా నష్టం భర్తీ అవుతుందనే భావనలో అన్నదాతలు ఉన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా చర్యలేవి తీసుకోకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన సమయంలో కూడా ప్రభుత్వం ఆదుకోకపోతే ఎలా పంటలు సాగు చేపట్టాలని వారు వాపోతున్నారు.
ప్రభుత్వం నుంచి
స్పందన కరువు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు.
రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. అర్హులైన కొంత మంది రైతులకు ఇంకా ఇంతవరకు ఖాతాలకు నగదు జమ కాలేదు. ఎందుకు అన్నదాత సుఖీభవ పథకం తమ ఖాతాకు జమ కాలేదని అడిగితే చెప్పేవారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు సమయంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నష్టం తప్ప మేలు జరగలేదనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మోంథా తుపానుతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో మొంథా
తుపాన్ నష్టం(హెక్లార్లలో)
పంట విస్తీర్ణం
పత్తి 1,564.80
వరి 114.75
మొక్కజొన్న 28.99
కంది 05.42
మినప 16.29
మొత్తం 1,730.25


