ఒకే చోట రెండు ఘటనలు ఒక ప్రమాదంలో వాహనాలు ధ్వంసం మరో ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం
చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమర్రు వద్ద జాతీయ రహదారి ప్రమాదాల అడ్డాగా మారుతోంది. సోమవారం కొద్దిపాటి కాలవ్యవధిలోనే ఇక్కడ రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో కాలేజీ బస్సు ప్రమాదంలో విద్యార్థులు క్షేమంగా బయటపడగా, మరో ప్రమాదంలో టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తున్న వృద్ధుడు తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. ఒకే ప్రాంతంలో వెంటవెంటనే రెండు ప్రమాదాలు జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
● నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఇంకొల్లు నుంచి నరసరావుపేట వైపు 8 మంది విద్యార్థులతో వెళ్తుండగా, నూతన జాతీయ రహదారిపై పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా వాహనం నియంత్రణ కోల్పోయి కళాశాల బస్సును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సు కూడా కొంతమేర దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బస్సు ఇంజిన్ ఆగిపోవడంతో, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం స్పందించి, మరో బస్సును పంపి విద్యార్థులను సురక్షితంగా కళాశాలకు తరలించింది. విద్యార్థులు ఎవరూ గాయపడలేదని కళాశాల వర్గాలు అధికారికంగా ధ్రువీకరించడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
● మొదటి ప్రమాదం జరిగిన స్థలానికి కొంత దూరంలోనే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాపాబత్తిన కోటయ్య అనే వృద్ధుడు తన కుమారులను కలవడానికి చిలకలూరిపేటలోని తూర్పుమాలపల్లికి వచ్చాడు. సోమవారం ఉదయం తన స్వగ్రామమైన బాపట్ల జిల్లా పర్చూరు మండలం గర్నెపూడికి తిరిగి వెళ్లడానికి తన టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై బయలుదేరాడు. కోటయ్య పసుమర్రు వద్ద హైవే దాటి గర్నెపూడి వైపు వెళ్తుండగా, అప్పటికే వేగంగా దూసుకొచ్చిన బొలోరో కారు అతన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన కోటయ్యకు తల, కాలికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది ఈఎంటీ శోభన్‌బాబు, పైలెట్ పవన్‌కల్యాణ్ ఘటనా స్థలానికి చేరుకుని, కోటయ్యకు ప్రాథమిక చికిత్స అందించి, పట్టణ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించడం జరిగింది. ప్రస్తుతం కోటయ్య ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈరెండు ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


