పెదకూరపాడు: గత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచిగా గెలుపొందిన తనను టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి గ్రామపంచాయతీ కార్యాలయానికి రావొద్దంటూ పంచాయతీ కార్యదర్శి అడ్డుకుంటోందని, చేసిన పనులకు బిల్లులు చేయకుండా వేధిస్తోందంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం మూసాపురం గ్రామ వైఎస్సార్ సీపీ సర్పంచ్ వేముల తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉప సర్పంచ్ బత్తుల విజయలక్ష్మీ, నాలుగో వార్డు సభ్యులు మేరుగా ఆదాం జ్యోతి, గ్రామస్తులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామంలో రూ. 3.75 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా మనోవేదనకు కార్యదర్శి గురిచేస్తుందన్నారు. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేస్తోందని వాపోయారు. గ్రామపంచాయతీ నిధులను గ్రామ అభివృద్ధి కొరకు టీడీపీ నేతలు పనులు చేస్తున్న ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా తాము తీర్మానాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే మేము చేసిన పనులకు బిల్లులు అడుగుతుంటే టీడీపీ నేతల అనుమతి కావాలని తెలుపుతున్నారని వాపోయారు. గత రెండు సంవత్సరాల నుంచి పంచాయతీ కార్యాలయానికి రావద్దంటూ కార్యదర్శి హుకుం జారీ చేసిందన్నారు. అదేవిధంగా ప్రజల వద్ద నుంచి ఇంటి పన్నులు ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా గ్రామస్తులు వద్ద నుంచి నగదు స్వీకరించి రశీదులు ఇవ్వడం లేదన్నారు. కార్యదర్శి ఆగడాలపై గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ఎంపీడీఓకు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. తాము చేసిన పనులకు వెంటనే బిల్లులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. వారి వెంట స్థానిక నాయకులు బత్తుల ఏడుకొండలు, సుబ్బారావు, వేముల బ్రహ్మేంద్ర, తమ్మిశెట్టి ప్రసాద్ తదితరులు ఉన్నారు.
కార్యాలయానికి రావొద్దంటూ
హుకుం జారీ చేస్తోంది..
చేసిన పనులకు బిల్లులు ఇవ్వటం లేదు
ఇంటి పన్నులు వసూలు చేసి రసీదు ఇవ్వటం లేదు
వైఎస్సార్ సీపీ ముసాపురం
గ్రామ సర్పంచ్ ఆవేదన


