సాక్షి టాస్క్‌ఫోర్స్ : ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించటంలో దిట్టగా పేరొందిన వివాదాస్పద సీఐ పొన్నూరి భాస్కర్ వీఆర్ బదిలీ అయ్యారు. పలు ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధుల నుంచి ఆయన తప్పుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాచేపల్లి సీఐగా భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. పచ్చ చొక్కా తొడుక్కున్న ఖాకీలా వ్యవహరించటం తీవ్ర వివాదస్పదంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించటంలో సీఐ అత్యుత్సాహం చూపించారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉప్పుతల హరికృష్ణపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. లాఠీతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. దీనిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. సీఐతో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్టేషన్ ప్రధాన గేట్‌కి బేడీలతో తాళాలు వేశారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్య సమయంలో కూడా సీఐగా భాస్కర్ ఉన్నారు. టీడీపీ నేతలను తప్పించేందుకు సీఐ ప్రయత్నాలు చేశారు. రామాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు పట్టపగలే దాడులకు తెగబడిన సమయంలో సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రేషన్ మాఫియాకు అండగా ఉండటం, గ్రానైట్ అక్రమ వ్యాపారానికి సహకరించి జేబులు నింపుకొన్నారు. దాచేపల్లి, మాచవరంలలో అసాంఘిక కార్యాకలపాలకు రాచబాటలు వేశారు. టీడీపీ వారితో పేకాట ఆడించి నెల మామూళ్లు తీసుకున్నారు. పేకాట ఆడించే ఓ వ్యక్తితో స్టేషన్‌కి మరమ్మతులు చేయించినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. రంగురాళ్ల తవ్వకాలకు, ఇసుక అక్రమ వ్యాపారులకు సీఐ అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఐని వీఆర్‌కి పంపించటం వెనుక ఓ మహిళ వ్యవహారం కూడా ఉన్నట్లుగా సమాచారం.


