వినుకొండ: కల్యాణ మండపం నిర్మాణానికి సంబంధించిన చందాల లెక్కలు అడగడంతో బంగారం వ్యాపారిపై టీడీపీ నాయకుడు దాడి చేశారు. పట్టణానికి చెందిన అన్నా రామకోటేశ్వరరావు అనే బంగారం వ్యాపారి ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరంలో గ్రామస్తుల విరాళాలతో కల్యాణ మండం నిర్మించారు. పట్టణానికి చెందిన ప్రముఖ రియల్‌ఎస్టేట్ వ్యాపారి పులిపాటి రామారావు సదరు మండపం కమిటీలో పెద్దగా ఉన్నారు. పదేళ్ల నుంచి చందాల వివరాలు లెక్కలు చూపించలేదని, ఇచ్చిన వారి పేర్లను కూడా ప్రకటించలేదని పులిపాటిని రామకోటేశ్వరరావు ప్రశ్నించారు. రెచ్చిపోయిన పులిపాటి రామారావు తన అనుచరలతో కలిసి రామకోటేశ్వరరావుపై దాడి చేశారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో పులిపాటితో పాటు మణికంఠ కోటేశ్వరరావు, అన్నా కోటేశ్వరరావులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.
వినుకొండ: పట్టణంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న బర్మా నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా పాఠశాల సెలవు కావడంతో బర్మా నాయక్, ఐదుగురు 8 వ తరగతి విద్యార్థులు పీఈటీ అనుమతితో సమీపంలో ఉన్న కొండ మీద ఆలయానికి వెళ్లారు. మార్గ మధ్యలో బర్మా నాయక్ కొండపై నుంచి పడి దోర్లుకుంటూ వెళ్లి రాయికి తగిలాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలకు తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


