వినుకొండ: శ్రీరామ నవమి పర్వదినం రోజున దేశవ్యాప్తంగా స్వామి వారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించటం ఆనవాయితీ. చోళ రాజుల కాలంలో నిర్మించిన వెయ్యేళ్లకుపైగా చరిత్ర కలిగిన వినుకొండ కోదండ రామాలయంలో మాత్రం శ్రీరామ నవమికి కల్యాణం నిర్వహించరు. 85 సంవత్సరాల క్రితం దేవాలయంలో కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో పీటల మీద కూర్చున్న దంపతులు మృతి చెందారు. అప్పటి నుంచి వేడుకలు నిలిచిపోయాయి. తరువాత ఏడాది కూడా స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు ప్రయత్నించగా అశుభం జరిగింది. పీటల మీద కూర్చునేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో వేడుకలు పూర్తిగా నిలిపివేశారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న త్యాగరాజు ఉత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణం నిర్వహించేవారు.
ఎంతో ప్రసిద్ధి
త్రేతాయుగంలో సీతాన్వేషణలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి, జటాయువు ద్వారా సీతమ్మ జాడ గురించి ఈ కొండ ప్రదేశంలోనే మొట్టమొదటి సమాచారం అందుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా ‘వినబడిన కొండ’ కాలక్రమంలో ‘వినుకొండ’గా ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ రాజులు తమ విజయాలకు ప్రతీకగా ఈ పురాతన ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామి వారు దక్షిణాభిముఖంగా ఉండి భక్తులకు దర్శనమివ్వడం ఒక ప్రత్యేకత. విజయనగర పాలకుడు సదాశివ దేవరాయల కాలంలో రాయదళవాయి వారికి స్వామి వారు స్వప్నంలో సాక్షాత్కరించారు. స్వామివారి ఆదేశానుసారం గరుడ పక్షి వాలిన చోట నాలుగు స్తంభాల మండపం నిర్మించి, సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించారు.
అపురూప శిల్పకళా సంపద
ఈ ఆలయంలోని విగ్రహాలు అత్యంత కళాత్మకమైన ఏకశిలపై చెక్కబడ్డాయి. భూదేవి, విష్ణుమూర్తి అంశలతో కూడిన ఈ విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. అనంతరం చక్రపాణి రాయల వారు తన సొంత ధనంతో నిర్మించిన శిలా మండపం నేటికీ ఈ ఆలయ వైభవానికి అద్దం పడుతోంది. దీనిపై ఆలయ ప్రధాన అర్చకుడు నారాయణం రామ్మోహనాచార్యులు మాట్లాడుతూ... ‘‘తాతల కాలం నుంచి వారసత్వంగా రామాలయం పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గతంలో శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం సమయంలో అశుభం జరుగటంతో రామనవమి రోజున ఆ వేడుక మాత్రం జరగటం లేదు. త్యాగరాజు ఉత్సవాలల్లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నాం.
వినుకొండ కోదండ రామాలయంలో 85 ఏళ్లుగా ఆగిన కల్యాణ వేడుక


