రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం విరాళంగా మరో రూ.4.80 కోట్లు ఇచ్చిన నడికట్టు రామిరెడ్డి
నాదెండ్ల: చిరుమామిళ్ళ అభివృద్ధిలో మరో మణిహారం చేరింది. గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి గురువారం అనుమతులు మంజూరయ్యాయి. గ్రామానికి చెందిన విద్యాదాత, గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి 2.70 ఎకరాల భూమిని ఆసుపత్రి నిర్మాణానికి విరాళంగా అందించారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం రూ.6 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసింది. ఆసుపత్రి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవసరమైన మొదటి అంతస్తుతోపాటు అనుబంధ బ్లాకుల నిర్మాణం కోసం రామిరెడ్డి వ్యక్తిగతంగా రూ.4.80 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆసుపత్రికి నడికట్టు రామిరెడ్డి ప్రజావైద్యశాలగా నామకరణం చేసేందుకు అనుమతించింది. నిధులతో ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు, ప్రసూతి, అత్యవసర వైద్య విభాగాలు ఏర్పాటు కానున్నాయి. 25 మంది వైద్యారోగ్య సిబ్బంది సేవలు అందించనున్నారు.


