దినసరి కూరగాయలు, సండ్రి మార్కెట్‌లకు వేలం దక్కించుకున్న టీడీపీ, జనసేన వర్గీయులు
నరసరావుపేట: పట్టణంలో కూరగాయల మార్కెట్, వీధుల్లో వ్యాపారులు, వాహనదారుల వద్ద నుంచి ప్రతిరోజూ పన్ను (అశీలు) సేకరించే కాంట్రాక్ట్ పనులను ఇది మీకు..అది నాకు అనే విధంగా టీడీపీ, జనసేన నాయకులు ఒకరినొకరు కుమ్మకై ్క చెరొకటి దక్కించుకున్నారు. ఈ వేలం పాటల్లో ఈ రెండు పార్టీలకు చెందిన వారు తప్పితే మరెవరూ పాల్గొనకపోవటం గమనార్హం. సుమారు 1.6 లక్షల మంది జనాభా నివాసం ఉండే 200 ఏళ్ల ప్రత్యేక గ్రేడ్ పురపాలక సంఘంలో 2026–27 ఏడాదికి సంబంధించి దినసరి కూరగాయల మార్కెట్ (హోల్‌సేల్ అండ్ రిటైల్), సండ్రి మార్కెట్, చేపలు, మాంసం మార్కెట్, కబేళా–1, కబేళా–2లకు వేలం పాటలు బుధవారం కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో నిర్వహించారు. ప్రతి ఏడాది కార్యాలయంలోనే బహిరంగ ప్రదేశంలో వేలం పాటలు నిర్వహించే ఆనవాయితీ ఉండగా ప్రస్తుతం కమిషనర్ చాంబర్‌లో తలుపులు వేసి నిర్వహించటం గమనార్హం. వేలంపాట జరుగుతుండగా రెండు పార్టీలకు చెందిన నాయకులు తమ మద్దతుదార్లతో కార్యాలయం బయట వేచి ఉన్నారు. దినసరి కూరగాయల మార్కెట్‌ను రామిశెట్టి అంజమ్మ్త రూ.23.60 లక్షలకు పాడుకోగా, రావెళ్ల సుబ్బమ్మ సండ్రీ మార్కెట్ పాటను రూ.22 లక్షలకు దక్కించుకున్నారు. ఫిజ్, మటన్ మార్కెట్ పాటను తాళ్లూరి దుర్గారాజు రూ.1.32 లక్షలకు పాడగా, కబేళా–1ను తాళ్లూరి దుర్గారాజు రూ.1లక్షకు పాడి దక్కించుకున్నారు. కబేళా–2ను వాయిదా వేశారు. పాటలను కమిషనర్ జి.రవికుమార్, ఆర్‌ఓ కె.శ్రీనివాసరావు, డీఇ మహమద్ రఫీక్, ఇతర అధికారులు నిర్వహించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


