తెనాలిటౌన్: వైకుంఠపురం లోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ కానుకలు సోమవారం లెక్కించారు. రూ.51 లక్షల నగదు, 61 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 745 గ్రాముల వెండి వచ్చింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడుతూ 93 రోజులకు హుండీ కానుకలు లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. 75 మంది వలంటీర్లు, బ్యాంకు సిబ్బంది దేవస్థాన సిబ్బందితో లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. పర్యవేక్షణాధికారిగా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సైదామాబి వ్యవహరించినట్లు తెలిపారు.
శావల్యాపురం: పల్నాడు జిల్లా శావల్యాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌యూబీ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ ఇంజనీరు (డీఈ) డి.శరత్ తెలిపారు. రైల్వే స్టేషను పరిధిలో జరుగుతున్న పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల అదేశాలకనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పది రోజుల వ్యవధిలోని పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో భాగంగా రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆయనతో పాటు రైల్వే అధికారులు, మతుకుమల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముండ్రు హనుమంతరావు ఉన్నారు.
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఫెమ్‌ప్లేర్ 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెమ్‌ప్లేర్–2026 చైర్ పర్సన్ డాక్టర్ కె. రూతురమ్య మాట్లాడుతూ అతిపెద్ద మహిళా వేడుక అని పేర్కొన్నారు. బాలికలే స్వయంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళా సమ్మేళనాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయా కళాశాలల నుంచి విద్యార్థినులు హాజరు కానున్నారని తెలిపారు.
మాచర్ల: చేతికందివచ్చిన పంటలను తొక్కిస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్న పైపులైను కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొత్తపల్లి, బైరవునిపాడు, పాలపల్లి గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎన్‌సీసీ కంపెనీ నిర్మించే నీటి పైపుల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భూమిలో పైపులైను ఏర్పాటు సమయంలో ముందుగా రైతులకు సమాచారం ఇవ్వకుండా మిర్చి పంటలను నాశనం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ముందుగా రైతులకు సమాచారం ఇచ్చి పంట పరిశీలించి వారి అనుమతితో పనులు చేపట్టాల్సి ఉండగా, కొత్తపల్లి గ్రామ శివారులో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపుగా పెరిగిన మిర్చి పంటలను సైతం పీకి వేసి, పైపు పనులు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామానికి చెందిన రైతు ఓరుగంటి జయప్రకాష్‌రెడ్డి, మరికొందరు రైతులకు సమాచారం ఇవ్వకుండా మిర్చిపంటలను యంత్రాలతో పెద్ద పెద్ద గుంతలు తీసి, పైపులైనులు ఏర్పాటు చేయడంతో పంట అంతా నష్టపోయినట్లు వాపోయారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో మరింత నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి, మున్ముందు రైతులకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు.


