ఖాళీ సిలిండర్లతో అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై నిరనస
నకరికల్లు: గ్యాస్ కోసం వినియోగదారులు రోడ్డెక్కారు. ఖాళీ సిలిండర్‌లతో స్థానిక అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్‌లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసన చేస్తున్న వారితో మాట్లాడి సర్దిచెప్పి పంపారు. ఈ ఘటన స్థానిక రాష్ట్ర రహదారిపై వైజంక్షన్ వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజన్సీలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన వినియోగదారులు ఉన్నారు. కాగా గత వారంరోజులుగా గ్యాస్ బుకింగ్ చేసినవారికి ఓటీపీ రావడం లేదు. అలాగే సిలిండర్‌ల పంపిణీ జరగడం లేదు. దీంతో సమీప గ్రామాల నుంచి ఖాళీ సిలిండర్‌లతో వినియోగదారులు స్థానిక గోడౌన్ వద్దకు చేరుకున్నారు. నోస్టాక్ బోర్డు ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ సమస్యను పరిష్కరించాలని, గ్యాస్ సిలిండర్‌ల పంపిణీ ప్రారంభించాలని స్థానిక రాష్ట్ర రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కె.సతీష్ ఆందోళన వ్యక్తం చేస్తున్న వారితో మాట్లాడారు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న సమస్య కాబట్టి త్వరలో పరిష్కారమవుతుందని సర్దిచెప్పారు. ఆందోళన చేసి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని హితవు పలికారు. దీంతో శాంతించిన వినియోగదారులు ఆందోళన విరమించారు.
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్, రెవెన్యూ క్లినిక్‌లో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 109 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా నరసరావుపేట డివిజన్‌కు చెందిన 22, సత్తెనపల్లి డివిజన్ ఆరు, గురజాల డివిజన్‌లకు చెందిన మూడు అర్జీలు స్వీకరించారు. అర్జీలను నాణ్యతగా, సకాలంలో పెండింగ్‌లేకుండా పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెన్స్‌పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నారదముని, డీఆర్‌డీఏ పీజీ ఝాన్సీరాణి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో 109 అర్జీలు స్వీకరించిన కలెక్టర్


