పీజీఆర్‌ఎస్‌లో 109 అర్జీలు స్వీకరించిన కలెక్టర్
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్, రెవెన్యూ క్లినిక్‌లో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 109 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా నరసరావుపేట డివిజన్‌కు చెందిన 22, సత్తెనపల్లి డివిజన్ ఆరు, గురజాల డివిజన్‌లకు చెందిన మూడు అర్జీలు స్వీకరించారు. అర్జీలను నాణ్యతగా, సకాలంలో పెండింగ్‌లేకుండా పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెన్స్‌పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నారదముని, డీఆర్‌డీఏ పీజీ ఝాన్సీరాణి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


