షాపులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

షాపులు కేటాయించాలి

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

బోగస్‌ సంస్థ పేరుతో షాపులను విక్రయిస్తున్న అంజుమన్‌ కమిటీ ఈ దోపిడీలో ఎమ్మెల్యే అరవిందబాబుకు భారీగా వాటాలు షాపులు కోల్పోయిన 72 మందికి మద్దతుగా నిరాహార దీక్ష కట్టడాలను పరిశీలించి ప్రభుత్వాన్ని హెచ్చరించిన డాక్టర్‌ గోపిరెడ్డి

పాత వ్యాపారులకే

నరసరావుపేట: అంజుమన్‌ కాంప్లెక్స్‌లోని పాత వ్యాపారులు 72 మందికి షాపులు కేటాయించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగుతామని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయానికి ఎదురుగా శ్రీరాంపురంలో నిర్మాణంలో ఉన్న అంజుమన్‌ కాంప్లెక్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పాత వ్యాపారులు కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ తక్షణమే జోక్యం చేసి ఈ అంజుమన్‌ షాపుల అక్రమ దందా వ్యవహారాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 2018 డిసెంబర్‌లో అంజుమన్‌ స్థలంలో ఉన్న 72 మందికి చెందిన షాపులను నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు అక్రమంగా కూల్చివేసి వీధిన పడవేశారన్నారు. 2019లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంజుమన్‌ షాపులకు చెల్లించవలసిన మున్సిపల్‌ బకాయిలలో రూ.35 లక్షలు ప్రత్యేక జీవో ద్వారా క్యాబినెట్‌ సమావేశంలో మినహాయింపునకు ఆమోదం పొంది, అన్ని అనుమతులు తీసుకొని షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. దాదాపు స్లాబ్‌ వరకు నిర్మాణాన్ని కొనసాగించామని, అప్పట్లో వక్ఫ్‌ బోర్డు ద్వారా అనుమతి పొంది ఒక్కొక్క షాపు వారి వద్ద నుంచి రూ.2 లక్షల తీసుకొని నిర్మాణం అనంతరం రూ.లక్ష తిరిగి ఇచ్చేలా వక్ఫ్‌ సీఇఓ అనుమతులతో ఈ నిర్మాణాలు ప్రారంభించామని తెలిపారు. నిర్మాణం స్లాబ్‌ దశలో ఉండగా 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు అహలె సున్నత్‌ జామియా మసీదు సంఘం పేరుతో ప్రస్తుత అంజుమన్‌ కమిటీ చైర్మన్‌ రహమతుల్లా ఒక బోగస్‌ సంస్థను ఏర్పాటు చేసి, ఈ అంజుమన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 26 షాపులు తనకు చెందినవని, తాను ముతవల్లిని అంటూ ఈ షాపులకు పూర్తి హక్కుదారుడిని తానేనని నమ్మబలుతున్నట్లు చెప్పారు.

ఇప్పటికే రూ.36 లక్షలు వసూలు

26 షాపులు అమ్మకం మొదలు పెట్టాడన్నారు. ఒక్కొక్క దానికి రూ.9 లక్షల చొప్పున నాలుగు షాపులను ఇప్పటికే విక్రయించారన్నారు. వక్ఫ్‌ బోర్డ్‌ అనుమతులు లేకుండా యథేచ్ఛగా విక్రయిస్తున్నాడని అన్నారు. పైన కూడా కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నామని చెప్పి కొంతమంది లాయర్ల దగ్గర కూడా ముందస్తుగా డబ్బులు వసూలు చేయడం చేశాడన్నారు. అనుమతులు లేని కట్టడాలపై కొంతమంది కోర్టుకు వెళితే స్టే ఇచ్చినప్పటికీ పనులు కొనసాగిస్తున్నారని అన్నారు. దీనిలో ఎమ్మెల్యే అరవింద బాబు పేరుతో రసీదులు ముద్రించి మదీనా రసూల్‌ అనే వ్యక్తి ఒక్కొక్క షాపునకు రూ.2.5 లక్షలు వసూలు చేస్తున్నాడన్నారు. ఈ 72 మందికి షాపులు కేటాయించడం లేదని చెబుతూ, కొత్త వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. అంజుమన్‌ సంస్థ సొంత ఆస్తి కాదనే విషయం స్థానిక ఎమ్మెల్యే తెలుసుకోవాలని హెచ్చరించారు. వక్ఫ్‌ బోర్డుకు చెందిన ఆస్తులను అక్రమ సంస్థల పేరుతో ఎమ్మెల్యే రసీదులు ఎలా ముద్రిస్తాడని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్‌ కరిముల్లా, వర్కింగ్‌ అధ్యక్షులు అచ్చి శివకోటి, సీనియర్‌ నాయకులు షేక్‌ ఖాజావలి మాస్టారు, నియోజకవర్గ మైనార్టీ విభాగ అధ్యక్షులు షేక్‌ శిలార్‌, మైనార్టీ విభాగ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్‌ ఖాదర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement