క్రీడలతో క్రమశిక్షణతో కూడిన జీవితం
●ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు
●ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఫ్లోర్‌బాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: క్రమశిక్షణతో కూడిన జీవనానికి క్రీడలు దోహదపడతాయని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం రాష్ట్రస్థాయి పురుషులు, మహిళల అంతర్ జిల్లాల ఫ్లోర్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ, విద్యార్థి దశలో క్రీడల పట్ల ఆసక్తి గలవారు క్రమశిక్షణతోపాటు శారీరక, మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, ఎంఏఎం కళాశాల చైర్మన్ ఎం.శేషగిరిరావు, పాఠశాల చైర్మన్ డాక్టర్ నాగోతు ప్రకాష్, డైరెక్టర్ నాగోతు సబిత, ప్రిన్సిపల్ రేఖా ఫూలేకర్, ఏపీ ఫ్లోర్‌బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.రత్నకుమార్, జాయింట్ సెక్రటరీ ఎం.కిషోర్‌బాబు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లి సురేంద్ర, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాదు, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. పోటీలకు 15 జిల్లాల నుంచి దాదాపు 250 మంది క్రీడాకారులు, అఫీషియల్స్ హాజరయ్యారు. మహిళా విభాగంలో పల్నాడు, నెల్లూరు జిల్లాల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్ టైగా ముగియగా షూట్ అవుట్‌లో పల్నాడు జిల్లా జట్టు 2–1 తేడాతో నెల్లూరుపై విజయం సాధించింది. అలాగే పురుషుల విభాగంలో బాపట్ల జట్టుపై వైఎస్సార్ కడపజిల్లా జట్టు 1–0 తేడాతో గెలుపొందింది.


