లభించని బాలుడి ఆచూకీ
●శుక్రవారం తల్లి, బిడ్డను కాలువలో
నెట్టివేసిన తండ్రి
●రెండు రోజులైన లభించని బాలుడు శరత్ ఆచూకీ
●గాలింపు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీసు సిబ్బంది
నరసరావుపేట రూరల్: కాలువలో గల్లంతైన ఏడు నెలల బాలుడు శరత్ ఆచూకీ ఆదివారం కూడా లభించలేదు. శుక్రవారం రాత్రి రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ తన భార్య త్రివేణి, ఏడు నెలల కుమారుడు శరత్‌ను చిలకలూరిపేట మేజర్ కేనాల్‌కి నెట్టివేయడంతో త్రివేణి మృతి చెందింది. త్రివేణి మృతదేహాన్ని శుక్రవారం రాత్రి ఆమె బంధువులు ఇక్కుర్రు సమీపంలో గుర్తించారు. అప్పటి నుంచి ఏడు నెలల బాలుడు శరత్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు. శనివారం పోలీసు సిబ్బందితో పాటు బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం ఎన్‌ఎస్‌పీ కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, రెవెన్యూ, పోలీసు, ఎన్‌ఎస్‌పీ సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు. రావిపాడు సమీపంలోని ఘటనా స్థలం నుంచి చిలకలూరిపేట వరకు బృందాలుగా విడిపోయి బోటులతో గాలింపు చేపట్టారు. దాదాపు 20 కిమీ వరకు గాలింపు నిర్వహించారు. ఘటనా జరిగిన రోజు కాలువ ఉధృతి ఎక్కువగా ఉంది. ఘటన జరిగిన రెండు గంటల్లో గాలించిగా రెండు కిలోమీటర్ల దూరంలో త్రివేణి మృతదేహం లభ్యమైంది. ఏడు నెలల బాలుడు కావడం, తక్కువ బరువు ఉండటంతో నీటి ఉధృతికి ఎక్కువ దూరం వెల్లిఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేట శివారు వరకు పోలీసులు గాలింపు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. మరో వైపు క్లూస్ టీమ్ ఆదివారం ఘటనా స్థలంలో నమూనాలు సేకరించారు.


