ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు గుర్తింపు
●కారులో ఐదుగురు ఉన్నట్లు గుర్తింపు
●పోలీసుల అదుపులో ముగ్గురు..!
నాదెండ్ల/యడ్లపాడు: 16వ నెంబరు జాతీయ రహదారిపై ఈ నెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న లాంగ్ ట్రైలర్ లారీని వెంబడిస్తూ వచ్చిన కారు, కారులోని వ్యక్తులు లారీని ఓవర్‌టేక్ చేసి ఆపటంతో లారీ డ్రైవర్ ఒక్కసారిగా ఎడమవైపుకు మళ్లించటంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వడ్లమూడి విజ్ఞాన్ లారా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిడుగురాళ్ల, వినుకొండ, తాళ్లూరు, విఠలాపురం తదితర ప్రాంతాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు మృత్యువాతపడగా, మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. లారీని ఓవర్‌టేక్ చేసిన కారు రవాణాశాఖకు చెందిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు హల్‌చల్ చేశాయి. దీంతో స్పందించిన పల్నాడు జిల్లా డీటీవో సంజీవ్‌కుమార్ హైవే కంట్రోల్ సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు తమ శాఖకు చెందింది కాదంటూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ అధికారిగా జిల్లా డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు, నాదెండ్ల ఎస్సై పుల్లారావు దర్యాప్తు చేపట్టారు.
కారు ఎవరిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం...
లారీని వెంబడించి ఓవర్‌టేక్ చేసిన కారు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టీఎస్08హెచ్‌వై3158 నంబరు గల కారు ఎవరిది, ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నారు. కారు నరసరావుపేట పరిసర ప్రాంతాలకు చెందినదంటూ తేలినట్లు సమాచారం. సీసీ ఫుటేజీలు సోషల్ మీడియాలో రావటంతో అప్రమత్తమైన నిందితులు కారును రాష్ట్రం దాటించారని గుర్తించారు. లోకేషన్ ఆధారంగా కారు ఎక్కడుందనే విషయం తెలుసుకుని స్వాధీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కారులో ఐదుగురు ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారించి వారిలో నరసరావుపేటకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మిగిలిన ఇరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణాలు, కారుకు సంబంధించిన వివరాలు, అందులో ఉన్న వారు ఎవరనేది, లారీని ఎందుకు ఆపారనే వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


