కోటి ఆశల ఉద్యమం
పెదకూరపాడులో విస్తృతంగా వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ
అచ్చంపేట/పెదకూరపాడు: రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెదకూరపాడులో ఉద్యమంలా కొనసాగుతోంది. పేదలకు, పేద విద్యార్థులకు ఉపయుక్తంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కనీవీనీ ఎరుగని రీతిలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారు. వాటిలో 5 కళాశాలలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభింపచేశారు. మరో ఆరు కళాశాలలు వివిధ దశలలో ఉన్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాగానే పారిశ్రామిక వేత్తలతో చేతులు కలిపి, కాలేజీ నిర్వహణ బాధ్యతను వారికి కట్టబెట్టాలన్న దురుద్దేశ్యంతో పీపీపీ విధానం అంటూ అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసే పన్నాగం పన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సీఎం చంద్రబాబు చేపట్టిన అనాలోచిత నిర్ణయంపై అట్టడుగు వర్గాలకు అవగాహన కల్సించడంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు సఫలీకృతం అయ్యాయి. ప్రజా సంఘాలతో పాటు వివిధ పార్టీలు కూడా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యవహారాన్ని తప్పు బడుతున్నాయి.
కలగానే వైద్య విద్య
ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతుందని, తమ పిల్లలను డాక్టర్ చదివించుకోవాలన్న తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని పేద, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులు వైద్యవిద్యను చదవకూడదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం కార్పొరేట్లకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నారని దుయ్యబడుతున్నారు.
నియోజకవర్గంలో 50వేలకు పైగా సంతకాలు..
వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని అచ్చంపేట, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి, వైద్యకళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 50వేలకు పైగా సంతకాలు సేకరించారు. నియోజకవర్గంలోని అచ్చంపేట మండల కేంద్రంలో 5వేలమంది పార్టీ శ్రేణులతో నిరసన ర్యాలీని సైతం నిర్వహించారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
నియోజకవర్గంలో ముమ్మరంగా కోటి సంతకాల సేకరణ
మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపుతో
ఉప్పెనలా కదిలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం
కోటి సంతకాల సమాచారం
మండలం సేకరించిన సంతకాలు
అచ్చంపేట 14,200
పెదకూరపాడు 9300
అమరావతి 9000
క్రోసూరు 10,600
బెల్లంకొండ 6900
కోటి ఆశల ఉద్యమం


