104 ఉద్యోగుల సమస్యలు తక్షణమే తీర్చండి
నరసరావుపేట: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తూ ప్రజా సంజీవనిగా పేరుతెచుకున్న 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు వెంటనే తీర్చాలని ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అధ్యక్ష, కార్యదర్శులు కోటిరెడ్డి, బాలు, కోశాధికారి షేక్ జిలాని మాట్లాడుతూ తామంతా చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. గ్రాట్యువిటీ, ఎర్న్‌లీవ్‌ల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని, ప్రస్తుత యాజమాన్యం కూడా ఇప్పటివరకు నియామక పత్రాలు, పే స్లీప్స్ కూడా ఇప్పటివరకు ఉద్యోగులకు అందచేయలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులు, యాజమాన్యం యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి జీతాలు రూ.18,500లకు పెంచాలని, అదేవిధంగా ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన డ్రైవర్‌లకు ఆటోమెటిక్ గా స్లాబ్ అమలు చేయాలని, ప్రతి డివిజన్‌కి ఒక బఫర్ సిబ్బందిని నియమించాలని, కార్మిక చట్ట ప్రకారం క్యాజువల్ లీవ్‌లు కోరారు. ప్రధాన కార్యదర్శి డి.బాలు, జిల్లాలోని 104 ఉద్యోగులు పాల్గొన్నారు.
నరసరావుపేట ఈస్ట్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనే కారణంలో వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 12మంది ఉద్యోగులను సస్పెండ్ చేయటం సరికాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్వర్ణ చినరామిరెడ్డి, కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సస్పెండ్‌కు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు. ఈనెల 3వ తేదీన గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సందర్శించారనీ, ఆ సమయంలో ఆరోగ్య కేంద్రాన్ని తాళం వేసి ఉండటాన్ని గమనించి కేంద్రంలోని 12 మందిని సస్పెండ్ చేయటం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఆరోజున కేంద్రంలోని ముగ్గురు ఉద్యోగులు సెలవుపై ఉన్నారనీ, మిగిలిన వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధి నిర్వహణలో ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల వివరణ కోరకుండా సస్పెండ్ చేయటం బాధాకరమని తెలిపారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై పునరాలోచించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ షేక్.బాజీ, తాలూకా యూనిట్ నాయకులు ఎం.ఫ్లోరెన్స్, ఎస్.చలమారెడ్డి, ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.


